ట్రంప్, కిమ్‌ల భేటీ.. తేదీ ఖరారు
– జూన్ 12న ఇరు దేశాల అధ్యక్షుల భేటీ
వాషింగ్టన్, జూన్2(జనం సాక్షి) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల భేటీ తేదీ ఖరారైంది. సింగపూర్‌లో జూన్ 12వ తేదీన ఈ సమావేశం జరగనుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ సమావేశం గురించి ఉ.కొరియా రాయబారి కిమ్ యోంగ్ చోల్‌తో వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో దాదాపు 80 నిమిషాల పాటు చర్చించిన అనంతరం ట్రంప్.. ఈ తేదీని ఖరారు చేశారు. ఉ.కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ పంపించిన లేఖను కిమ్ చోల్ ట్రంప్‌కు అందజేశారు. సమావేశం చాలా చక్కగా జరిగిందని, సింగపూర్‌లో జూన్ 12న కలుస్తామని ట్రంప్ పేర్కొన్నారు. న్యూయార్క్‌లో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపియోతో రెండు రోజుల పాటు చర్చల అనంతరం కొరియా రాయబారి చోల్ వాషింగ్టన్‌లో ట్రంప్‌ను కలిశారు. ఉ.కొరియాను అణు రహితంగా మార్చడం ప్రధాన ఉద్దేశంగా ఈ భేటీ జరగనుంది. అయితే కొరియాను అణు రహితంగా మార్చడమనేది చాలా సుదీర్ఘమైన పక్రియ అని ట్రంప్ అన్నారు. ‘ఇది చాలా పెద్ద పక్రియ.. ఒక్క సమావేశంతో అయిపోయేది కాదు.’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు పెరగడం చాలా మంచి విషయమన్నారు. ఉత్తర కొరియా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోందని, వారు అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తున్నారని, అది జరుగుతుందనడంలో సందేహం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. కిమ్‌తో సమావేశం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.