ట్రంప్‌, కిమ్‌ భేటీకి పటిష్ఠ భద్రత

గగనతలంపైనా ఆంక్షలు

సింగపూర్‌, జూన్‌6(జ‌నం సాక్షి) : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీకి సమయం ఖరారైంది. సింగపూర్‌

వేదికగా జూన్‌ 12 ఉదయం 9 గంటలకు వీరు సమావేశం కానున్నారు. భేటీ నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మరోవైపు సింగపూర్‌లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఇదే సమయంలో ట్రంప్‌, కిమ్‌ సమావేశం జరిగే సమయంలో సింగపూర్‌ గగనతలంలో కొన్ని ఆంక్షలు విధించనున్నట్లు తాజా సమాచారం. ట్రంప్‌, కిమ్‌ భేటీ నేపథ్యంలో సింగపూర్‌ గగనతలంలో తాత్కాలిక ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ నోటీసును ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌(ఐసీఏవో), యూఎస్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్టేష్రన్‌ తమ వెబ్‌సైట్లో ఉంచాయి. జూన్‌ 11, 12, 13 తేదీల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ సమయంలో సింగపూర్‌ ఛాంగీ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలు తమ వేగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక.. భద్రతా కారణాల దృష్ట్యా రన్‌వేపై కూడా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై అటు ఛాంగీ ఎయిర్‌పోర్టు గానీ.. ఇటు సింగపూర్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ గానీ ఇంకా స్పందించలేదు.