ట్రంప్‌ కుస్తీతో భారత్‌తో దోస్తీ

` స్వరం మార్చిన చైనా
` కలసి పోరాడాలని భారత్‌కు పిలుపు
` పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటాం
– చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటన
బీజింగ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్‌- చైనా లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్‌ పిలుపునిచ్చారు.ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో తెలియజేశారు. ‘చైనా-భారత్‌ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్‌-చైనా) కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్‌ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏప్రిల్‌ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్‌ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్‌కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.అయితే భారత్‌.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్‌ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్‌ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.
పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటాం – చైనా అధ్యక్షుడు
అమెరికా ప్రతీకార సుంకాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా తన స్వరాన్ని మార్చినట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల నేపథ్యంలో చైనా స్పందనలు చూస్తే అలాగే కనిపిస్తోంది.తాజాగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడంతోపాటు సరఫరా వ్యవస్థలను మరింత మెరుగుపరచుకోవడం ద్వారా పొరుగుదేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామన్నారు.పొరుగుదేశాలతో సంబంధాలకు సంబంధించి బీజింగ్‌లో రెండు రోజులపాటు జరుగుతోన్న కీలక సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో పొరుగు దేశాలతో కలిసి పనిచేసే సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కొత్త వ్యవస్థను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు జరగాలని చెప్పినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడిరచింది.డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్న చైనా పొరుగుదేశాలతో సత్సంబంధాలే మేలని గుర్తించినట్లు తెలుస్తోంది. భారత్‌ సహా జపాన్‌, దక్షిణ కొరియా వంటి పొరుగు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌-చైనాలు జట్టుకట్టాలని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం కూడా తాజాగా పేర్కొనడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనాపై మరో 50శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో అక్కడ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు 104శాతానికి చేరాయి. అయితే, ఈ ప్రతికూల పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటామని చెబుతోన్న డ్రాగన్‌, తగినవిధంగా బదులిచ్చేందుకు విధానపరంగా తమ వద్ద ఆయుధాలున్నాయని పేర్కొంది.
సానుకూల దిశగా చైనా-భారత్‌ సంబంధాలు: జైశంకర్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్‌ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి.ఈ క్రమంలో.. భారత్‌-చైనా సంబంధాలు బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం.తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.2020లో తూర్పు లడ్డాఖ్‌లోని గల్వాన్‌ లోయ లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. మరోవైపు.. ట్రంప్‌ టారిఫ్‌ల నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్‌ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌, చైనా జత కట్టాలని న్యూఢల్లీిలోని బీజింగ్‌ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్‌ అభిప్రాయపడ్డారు. ‘’పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్‌ చేశారు.

భారత్‌కు మరో టెన్షన్‌..
` ఫార్మారంగంపై సుంకాలకు ట్రంప్‌ సిద్ధం..!
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. అతి త్వరలోనే ఫార్మా రంగంపై టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఆ ఒక్క రంగాన్ని ఆయన మినహాయిస్తూ వచ్చారు. రిపబ్లికన్ల డిన్నర్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘’ఫార్మారంగంపై టారిఫ్‌లు ఉండనున్నాయి. ఎందుకంటే మనం సొంతంగా ఔషధాలను తయారుచేసుకోము. అవి ఇతర దేశాల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతాయి. ఆ రంగంపై మనం విధించనున్న సుంకాలు చూసి కంపెనీలు ఇక్కడే తమ ఫ్యాక్టరీలు పెట్టేం దుకు ముందుకొస్తాయి. ఎందుకంటే అమెరికా చాలా పెద్ద మార్కెట్‌. అతి త్వరలోనే ఫార్మాపై ప్రధాన టారిఫ్‌ను ప్రకటిస్తాను. దానిని చూసి కంపెనీలు చైనా, ఇతర దేశాలను వీడతాయి. ఎందుకంటే వాటి ప్రధాన ఉత్పత్తులు ఇక్కడే అమ్ముడవుతాయి’’ అని ట్రంప్‌ వెల్లడిరచారు.భారత్‌లోని ఫార్మా సంస్థలు జనరిక్‌ ఔషధాలను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. అక్కడి ఆరోగ్య వ్యవస్థలో ఇవి కీలక పాత్రను పోషిస్తున్నాయి. మన దేశంలో తయారయ్యే 40 జనరిక్‌ ఔషధాలు అమెరికాకే వెళతాయి. 2024 సంవత్సరంలో దాదాపు 8 బిలియన్‌ డాలర్ల మేరకు ఈ రంగం నుంచి ఎగుమతులు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత ఫార్మా రంగంపై ట్రంప్‌ టారిఫ్‌లు విధిస్తే కచ్చితంగా దాని ప్రతికూల ప్రభావం అమెరికాలోని వినియోగదారులపైనా పడనుంది. అక్కడి ప్రజలు మన దేశం నుంచి వచ్చే చౌక జనరిక్‌ ఔషధాలను వినియోగిస్తారు. ట్రంప్‌ నిర్ణయంతో వీటి ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ఇది ఆరోగ్యరంగంలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.మరోవైపు ఇప్పటికే జనరిక్‌ ఔషధాల తయారీలో లాభాలు అతి తక్కువగా ఉంటున్నాయి. దీనికి టారిఫ్‌లు కూడా తోడైతే.. భారత్‌లోని తయారీదారులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. అంతేకాదు.. తయారీదారులకు ఔషధాల కొరత, లాభదాయకత తగ్గడం వంటివి ఎదురుకావచ్చని అంచనా వేస్తున్నారు. ఔషధ రంగంలో చైనా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఆ దేశంపై 104శాతం సుంకాలను ట్రంప్‌ విధించారు. ఈ నేపథ్యంలో ఫార్మాపై సుంకాలు అమల్లోకి వస్తే డ్రాగన్‌ పరిస్థితి దారుణంగా తయారవుతుంది.