ట్రిపుల్ ఐటీకి విద్యా మండలి గుర్తింపు
ఆదిలాబాద్, నవంబర్ 29 : జిల్లాలోని బాసరలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ కళాశాలకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు లభించడంతో సర్వత్రా వ్యక్తం అవుతోంది. సరస్వతీదేవి కొలువుదీరిన బాసరలో 2009లో ట్రిపుల్ ఐటీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాల ఏర్పాటు వల్ల విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జిల్లాకు ప్రాధాన్యత పెరగనున్నది. మరో పక్క సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.36.50 కోట్లు మంజూరు చేసి వివిధ పనులను చేపట్టనున్నారు. ఇందులో రూ.11కోట్లతో అక్షర అభ్యాస మండపం, 25.50కోట్ల రూపాయలతో వంద గదుల సత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ నుంచి అనుమతులు రావడంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఒక పక్క అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు, మరోపక్క ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడంతో బాసరకు కొత్త కళ రానున్నది. అంతేకాకుండా భక్తులకు అనేక సౌకర్యాలు సమకూరనున్నాయి.