డబ్బు సంపాదించాలని బయలుదేరి కానరాని లోకాలకు

మెదక్ (చేగుంట): మెరుగైన జీవితం గడపాలంటే డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తి దానికోసం విదేశాలకు వెళ్లడమే సరైన మార్గం అనుకున్నాడు. అనుకున్నదే తడువు అన్ని ఏర్పాట్లు చేసుకొని సౌదీకి బయలుదేరిన వ్యక్తిని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట గేటు వద్ద గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.

వివరాలు.. కరీనంగర్ జిల్లా కోరుట్లకు చెందిన జావేద్(34) సౌదీ వెళ్లడానికి తవేరా వాహనంలో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరాడు. అతన్ని సాగనంపడానికి అతనితో పాటు కుటుంబసభ్యులు కూడా బయలుదేరారు. ఈరోజు తెల్లవారుజామున వాహనం మాసాయిపేట వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ, తవేరాను ఢీకొట్టింది. దీంతో జావేద్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు.