డిఎంఅండ్ హెచ్ఓ ఆకస్మిక తనిఖీ*
మునగాల, జూన్ 8(జనంసాక్షి): మునగాల మండలంలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోట చలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి ఆవరణ ప్రాంగణాన్ని, అన్ని వార్డులను, గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక వైద్య సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ, సాధారణ ప్రసవాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కోరారు. మొదటి కాన్పు ఎక్కడైనా సాధారణ ప్రసవం అయ్యే విధంగా చూడాలని, ఇందువలన రెండవ కాన్పు కూడా సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంటుందన్నారు. మహిళలలో రక్త శాతం తగ్గకుండా ఐరన్ మాత్రలు వాడే విధంగా ప్రోత్సహించాలని, అవసరమైన వారికి ఐరన్ ఇంజక్షన్ రూపంలో పెట్టాలని సూచించారు. సుఖప్రసవం కొరకు సాధారణ వ్యాయామాలు చేసే విధానాన్ని వివరించారు. అసంక్రమిత వ్యాధులైన బిపి, షుగర్ మరియు క్యాన్సర్లపై దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. రొమ్ము క్యాన్సర్ కి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కి సంబంధించిన పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య కార్యకర్తల ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షయ నిర్ధారణ పరీక్షలు అన్ని గ్రామాలలో నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించినట్లు, ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం దీని ద్వారా అందిస్తున్నట్లు తెలియజేశారు. రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల సదుపాయాలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయని, ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాలలో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు మరింతగా అందే విధంగా కృషి చేయాలని వైద్యాధికారిని మరియు సిబ్బందిని కోరారు. ఆరోగ్య కేంద్రం ఆవరణం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉందని, వచ్చే రోగులకు మంచి ఆక్సిజన్ లభిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్, మాస్ మీడియా అధికారి అంజయ్య, జిల్లా మేనేజర్ భాస్కర రాజు, ఎపిడమిక్ సెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిహెచ్ యాదగిరి, హెల్త్ సూపర్వైజర్ వినోద, స్టాఫ్ నర్స్ సునీత, శాంతయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.