డిమాండ్లను నెరవేరిస్తే.. 

ఉ.కొరియాపై ఆంక్షలు రద్దు
– అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో
వాషింగ్టన్‌, మే14(జ‌నం సాక్షి) : అణ్వాయుధ కార్యక్రమానికి పూర్తిగా తెరదించి అణు పరీక్షా కేంద్రాలను ధ్వంసం చేయాలన్న ప్రపంచ దేశాల డిమాండ్లను నెరవేరిస్తే తాము ఉ.కొరియాపై అమలు చేస్తున్న ఆంక్షలను రద్దు చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు. ఆంక్షలను రద్దు చేయటంతో పాటు ద.కొరియాతో సమానంగా ఆర్థిక ప్రగతి సాధించేలా సహకరిస్తామని ఆయన చెప్పారు. పలు ఛానెల్స్‌లో ప్రసారమైన మార్నింగ్‌ టాక్‌షోలలో ఆయన మాట్లాడుతూ అమెరికా ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న కష్టార్జితాన్ని తాము ఆ దేశంలో పెట్టుబడులుపెట్టబోమని, అయితే ఉ.కొరియా విద్యుత్‌, వ్యవసాయం, మౌలిక వసతుల రంగాలలో అమెరికన్‌ ప్రైవేటుకంపెనీల పెట్టుబడులకు మార్గం సుగమం అయ్యేందుకు వీలుగా ఆంక్షలను తొలగిస్తామని చెప్పారు. జూన్‌ 12న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌లు సింగపూర్‌లో భేటీ కానున్న నేపథ్యంలో పాంపియో ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.