డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి తాగునీరు
కేసీఆర్ కలల ప్రాజెక్ట్ మిషన్‌భగీరథ
అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయాలి
ఫిల్టర్ బెడ్ పనులను పరిశీలించిన ఎంపీ కవిత
నిజామాబాద్, నవంబర్11(జనంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించిన మేరకు డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్‌భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ పనులు పూర్తి చేయించి నీటిని అందించి ఇచ్చిన హావిూని నిలబెట్టుకుంటామని అన్నారు. శనివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్గుల్ గ్రామంలో నిర్మితమవుతున్న మిషన్ భగీరథ పంప్ హౌజ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ పనులను కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కలల ప్రాజెక్ట్ మిషన్ భగీరథ అని, అనుకున్న సమాయానికి పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్గుల్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు త్వరలోనే ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. . ఈ ప్లాంట్ ద్వారా 60ఎంఎల్‌టీ నీటిని శుద్ది చేయటం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న విధంగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని కవిత స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతుందని, తద్వారా అభివృద్ధి పనులను అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ నేతల కుట్రలను తిప్పికొట్టి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులకు తెరాస ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ప్రతి పల్లె, ప్రతి మండలం, ప్రతి నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కవిత వెంట ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, జీవన్‌రెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు.