డీఎస్పీ హత్యకేసు దోషులను శిక్షిస్తాం

కేసు సీబీఐ విచారణకు సిఫార్సు
యూపీ సీఎం అఖిలేశ్‌
లక్నో, మార్చి 6 (ఆర్‌ఎన్‌ఏ):డీఎస్పీ హత్యపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అలాగే, దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చింది. కుండా పట్టణ డీఎస్పీ జియా ఉల్‌ హక్‌, బలిపూర్‌ గ్రామ పెద్ద నాన్హి యాదవ్‌ హత్య కేసుల్లో దోషులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. హత్యోదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో దర్యాప్తు చేయించేందుకు సిఫార్సు చేశామని చెప్పారు. అలాగే, సంఘటనా స్థలం నుంచి పారిపోయిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివారం హత్యకు గురైన నాన్హియాదవ్‌ కుటుంబ సభ్యులను అఖిలేశ్‌ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు నిరసనకు దిగారు. ఆయనను అడ్డుకొనేందుకు యత్నించారు. హత్యకు కారకులైన మాజీ మంత్రి రాజభయ్యాతో పాటు ఆయన అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే, పోలీసులు వారిని నియంత్రించడంతో బాధిత కుటుంబ సభ్యులను అఖిలేశ్‌ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్పీ, గ్రామపెద్ద హత్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.ఉ ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ‘నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఆ రోజు ఘటనా స్థలం నుంచి పారిపోయిన పోలీసులపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. స్థానికుల నిరసనలపై ప్రశ్నించగా.. హత్యలను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని, రాజకీయ సమస్యగా భావించొద్దని కోరారు. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. బాధిత కుటంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాజాభయ్యాను అరెస్టు చేస్తారా? అని సీఎం పక్కనే మంత్రి ఆజాం ఖాన్‌ను ప్రశ్నించగా.. కొంతకాలం వేచి చూడాలన్నారు. ‘నేనెక్కడినే నిర్ణయం తీసుకోలేను. నిర్ణయం తీసుకొనేందుకు నేను కోర్టును కాను. ఎవరు దోషులన్నది న్యాయస్థానాలే తేల్చాలి. దీనిపై ఇప్పటికే అసెంబ్లీ ప్రకటన కూడా చేశాను’ అని అన్నారు.