డీఎస్సీలోనే మైనారిటీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
– వచ్చే ఏడాది జూన్ నుంచి 60 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు
– బాలికలకు 30, బాలురలకు 30
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): వచ్చే సంవత్సరం నిర్వహించబోయే డీఎస్సీలోనే మైనారిటీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. వారి కోసం వచ్చే విద్యా సంవత్సరం (2016 జూన్) నుంచి 60 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటిలో బాలికలకు 30, బాలుర కోసం 30 పాఠశాలలు కేటాయించాలన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ నిధులతో ఈ పాఠశాలలు నిర్మించాలని, విద్యాశాఖ నిర్వహణ బాధ్యత స్వీకరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పాఠశాలల ఏర్పాటుపై మంత్రులు, అధికారులతో ఆయన సచివాలయంలో సవిూక్ష జరిపారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ విూడియంలో విద్యా బోధన జరగాలని సీఎం కేసీఆర్ చెప్పారు. మొదటి ఏడాది 5, 6, 7 తరగతులలో ప్రవేశాలు కల్పించి.. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ 12వ తరగతి వరకు విద్యా బోధన జరపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జూన్ లో ఈ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మైనార్టీ పాఠశాలలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా డీఎస్సీ నోటిఫికేషన్ తో రావాలన్నారు. వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. మొదటి ఏడాది కిరాయి భవనాల్లో పాఠశాలలు నడపాలన్న సీఎం కేసీఆర్.. 2017 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త భవనాలు నిర్మించాలన్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికి అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. వక్ఫ్ బోర్డు స్థలాలను కూడా మైనార్టీ స్కూళ్లకు ఉపయోగించుకోవచ్చన్నారు. ఒక్కో భవనాన్ని 20 కోట్లతో.. కనీసం 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని అన్నారు. ఈ బడ్జెట్ లోనే రెసిడెన్షియల్ పాఠశాలలకు నిధులు కేటాయిస్తమని చెప్పారు. హైదరాబాద్ లోని చంచల్గూడ జైలును చర్లపల్లికి తరలించాలన్న ముఖ్యమంత్రి.. రేస్ కోర్సును కూడా నగర శివారుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు స్థలాలను రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ఉపయోగించాలన్నారు. కార్యక్రమాలు వేగంగా అమలయ్యేందుకు సిబ్బందిని నియమించాలని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేస్తే వెంటనే ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, జగదీష్రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఏసీబీ డైరెక్టర్ ఎ.కె.ఖాన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షఫి ఉల్లా, మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ అక్బర్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరువు సాయం విడుదల చేయండి
కరువు బారిన పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయం వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలవాలని.. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 60శాతం ప్రాంతం కరువు బారిన పడిందని.. రైతులు ఎంతో నష్టపోయారని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను కేంద్రానికి పంపిందని, కేంద్ర బృందాలు కూడా రాష్ట్రంలో పర్యటించి పరిస్థితిని స్వయంగా చూశాయన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇవాళ మహారాష్ట్రకు రూ. 3,100 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ. 2,200 కోట్లు కరువు సహాయం విడుదల చేసింది. ఇదిలా వుండగా వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. పన్నులు వందశాతం వసూలు చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. మూస పద్ధతులు మాని… బడ్జెట్ రూపకల్పన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలు, ప్రభుత్వ కర్తవ్యాలను గమనించి రాష్ట్ర బడ్జెట్ లో వివిధ శాఖలు, పథకాలకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో అనుసరించిన మూస పద్ధతిని విడనాడాలని చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనపై హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సవిూక్ష జరిపారు.సంక్షేమం, అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నందున బడ్జెట్ రూపకల్పనలో ప్రణాళిక వ్యయం ఎక్కువ ఉండేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.ప్రజల అవసరాలు, ప్రభుత్వ కర్తవ్యాలను గమనించి నిధుల కేటాయింపులు జరపాలన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉన్నందున బడ్జెట్ రూపకల్పనలో ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రణాళిక వ్యయంలో రూ. 25 వేల కోట్లు నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయిస్తున్నందున మిగతా నిధులను చాలా వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల వారీగా అన్ని శాఖలు తాము చేసే పనులపై పూర్తి నివేదిక తయారు చేసి ఆర్థిక శాఖకు సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రులు ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని నిధులు కావాలనే విషయంలో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు జరపాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో అంతర్గత సామర్ధ్యం పెరగాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పన్నుల వసూళ్లు వందకు వంద శాతం జరగాలన్నారు. దుబారా తగ్గించడం ద్వారా ప్రణాళికేతర వ్యయాన్ని అదుపు చేయవచ్చని చెప్పారు. ప్రణాళికేతర వ్యయాన్ని ఎంత తగ్గించగలిగితే అంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం సాధ్యమవుతుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజెందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు బీఆర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రభుత్వ శాఖల్లో అంతర్గత సామర్థ్యం పెరగాలి
ప్రభుత్వ శాఖల్లో అంతర్గత సామర్థ్యం పెరగాలని అన్న సీఎం పన్నుల వసూళ్లు వందకు వందశాతం జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దుబారా తగ్గించడం ద్వారా ప్రణాళికేతర వ్యయాన్ని అదుపు చేయవచ్చు. ప్రణాళికేతర వ్యయాన్ని ఎంత తగ్గించగలిగితే అంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం సాధ్యమవుతుంది. ప్రణాళిక వ్యయంలో రూ. 25 వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయిస్తున్నందున మిగతా నిధులను చాలా వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సీఎం పేర్కొన్నారు.