డీల్‌పై గుండె గుబేల్
ఏలూరు, జూలై 19 : రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఏ ప్రతిపాదించిన ప్రణబ్‌ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం రాష్ట్రంలో మారబోతున్న రాజకీయ పరిణామాలకు సూచిక అన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఆఖరి దశలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాలు ఎదుర్కొంటూ గత రెండు నెలలుగా చంచలగూడ జైలులో జ్యుడిషియల్ రీమాండ్‌లో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహాన్ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికలో అనుసరించి వ్యూహం వెనుక పరమార్థం ఏమైవుంటుందన్న అంశమే ఇప్పుడు తాజా చర్చ జగన్ జైలు నుండి బయట పడడానికే ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా మొగ్గు చూపారన్న ఎదురు దాడిని తెలుగు దేశం పార్టీ తీవ్రతరం చేసింది. కాంగ్రెస్ పై ఒంటికాలిపై లేచిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన పంథా మార్చుకోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆయనకు డీల్ (ఒప్పందం) కుదిరిందన్న విమర్శలను టిడిపి ఎక్కుపెట్టింది. కాంగ్రెస్, వైస్‌ఆర్ కాంగ్రెస్ రెండూ ఒకేటేనన్న తమ ఆరోపణలు ఇప్పుడు నిజమైనాయని టిడిపి నేతలు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలు సత్యదూరమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎం.పి. మేకపాగటి రాజమోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, జూపూడి ప్రభాకరరావు బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు.
తెలుగుదేశంపార్టీకి దమ్ముంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానం పెడితే ఎవరివి జిమ్మిక్కు రాజకీయాలో తెలుతుందని జూపూడితో పాటు, పాయకరావు పేట ఎం.ఎల్.ఎ జి.బాబురావు గురువారం టెలివిజన్ ఛానళ్ళ చర్చావేదికలో సవాల్ విశారు. జగన్ డీల్ కుదుర్చుకోలేదని కాంగ్రెస్ అధిష్టానంతో డీకోంటూనే ఉన్నారని బాబురావు అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాలకు అతీతం కాబట్టే సెక్యులర్ విధానంలో ఆలోచించి తమ అధినేత జగన్, యూపిఎ బలపరిచిన ప్రణబ్ ముఖర్జీతో పాటు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అన్సారీకి మొగ్గుచూపామంటున్నారు. మొదటి నుండి యూపిఎకు మద్ధతు ఇస్తామని చెబుతూ వస్తున్న జగన్ వైఖరి రాష్ట్రపతి ఎన్నికలో కూడా మడమ తిప్పని – మాటతప్పని పంథాకు నిదర్శనమని బాబురావు అన్నారు. రాజకీయాల్లో ఓటర్లు చైతన్యవంతులు కావాలని, ఓటు హక్కు వినియోగించుకోవాలని తరచూ ఉపన్యాసాలిచ్చే చంద్రబాబునాయుడు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన రాష్ట్రపతి ఎన్నికలో తన పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలతో ఓటింగ్‌లో ఎందుకు పాల్గొనలేదో వివరణ ఇవ్వలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. వీరి వాదనలు, సవాళ్ళు ఇలా వుంటే టిడిపి నేతల్లో అభద్రతాభావం కనిపిస్తుంది. నూజివీడు ఎమ్మేల్యే రామకోటయ్య రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పార్థసారథి కారులో రావడం ఇలా వచ్చింది చాలక ప్రణబ్‌కు ఓటు వేయడం టిడిపీలో దుమారం లేపింది. ఓటింగ్‌కు టిడిపి దూరంగా ఉండటంపై చిత్తూరు జిల్లా పలమనేరు టిడిపి ఎమ్మేల్యే అమరనాథరెడ్డి తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా చంద్రబాబు రెడ్డిపై నిప్పులు చెరుగుతున్న కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని కూడా ప్రణబ్‌కే ఓటు వేశారన్న సమాచారం టిడిపిలో ఒక కుదుపు కుదిపింది. రానున్న రోజుల్లో జగన్‌ను కాంగ్రెస్ పార్టీ రక్షించడానికి ఆయనతో కలసి ప్రయాణించడానికి రాష్ట్రపతి ఎన్నిక మార్గం చూపిందన్న ప్రచారం టిడిపి వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రబాబు ఆయన సన్నిహితులు అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలతో వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 23న సుప్రీంకోర్టులో ఆదేశాలకు దారి తీయబోతుంది. ఆ పరిణామం ఎలా ఉంటుందో అన్న ఆందోళన టిడిపి నేతల్లో సహజంగా ఉండనే ఉంది. జైలు నుండి ఖుషీగా వచ్చిన జగన్ రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు ఎంతో ఆనందంగా కనిపించారు. గత రెండు నెలలుగా జైలులో ఉన్న జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు జడ్+ భద్రత కేటగిరిలో అసెంబ్లీకి వెళ్ళారు. జైలు బయట ఆయనను చూసేందుకు వచ్చిన వందలాది మంది అభిమానులకు చిరునవ్వులు చిందిస్తూ ముకుళిత హస్తాలతో అభివాదం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న జగన్‌ను కాంగ్రెస్ నేతలు అనుసరించడం విశేషంగా కనిపించింది. మరోవైపు లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి విజయమ్మ, 17మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి కాన్వాయ్‌గా అసెంబ్లీకి బయలుదేరారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌పార్టీకి రాజీనామాలు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, ఏలూరు ఎమ్మెల్యే ఎ.నాని విజయమ్మను కలుసుకున్న అనంతరం ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేశారు.
మరో విశేషం ఏమంటే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన మద్దాల రాజేష్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో కలసి ఒకే కారులో అసెంబ్లీకి రావడంతో చర్చ జోరుగా సాగింది. అదే సమయంలో సంచల్‌గూడా జైలు నుంచి ఓటింగ్‌లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, మంత్రులు పితాని సత్యనారాయణ, శ్రీధరబాబు, మాణిక్యవరప్రసాద్, గండ్ర వేంకట రమణారెడ్డి కలుసుకోవడం కూడా చర్చనీయాంశమైంది.