డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా- ఉత్తరకొరియా దేశాధినేతల మధ్య జూన్ 12న జరగాల్సిన భేటీ రద్దయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భేటీపై కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నీలినీడలు కమ్ముకున్నాయి. కిమ్‌తో తాను భేటీ కాబోవటం లేదని ట్రంప్ తేల్చారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ట్రంప్ పేరుతో శ్వేతసౌధం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ‘నీతో భేటీ అవ్వడానికి నేను ఎంతో ఆస్తక్తిగా ఎదురు చూశాను. కానీ, దురదృష్టవశాత్తూ ఇటీవల మీరు చేసిన ప్రకటనల్లో అమెరికాపై ఎంతో ద్వేషం, శత్రుత్వ వైఖరిని ప్రదర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ భేటీ అనవసరం అనిపించింది.’’ అని కిమ్‌ను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు.
అణుపరీక్షా కేంద్రాన్ని పేల్చేసిన కొన్ని గంటల్లోనే..
అణుపరీక్షలతో ప్రపంచాన్ని హడలెత్తించిన ఉత్తర కొరియాను దారికి తెచ్చేందుకు అమెరికా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగా ఆ దేశంతో చర్చల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా తొలిదశలో ఉత్తర-దక్షిణ కొరియాల అధ్యక్షులు భేటీ అయ్యారు. అనంతరం ట్రంప్‌తో భేటీ అవ్వాలని నిర్ణయించారు. అయితే కిమ్‌తో భేటీపై అమెరికా కొన్ని షరతులు విధించింది. ఉత్తర కొరియా అణుకార్యక్రమాలు నిలిపివేయకుండా భేటీ అయి ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొంది. అణ్వాయుధాలను వదిలేయాలని మరింత ఒత్తిడి చేస్తే తాము చర్చల నుంచి వైదొలగుతామని ఉత్తరకొరియా హెచ్చరించింది. దీంతో ఇప్పట్లో చర్చలు జరగకపోవచ్చని ట్రంప్ కూడా ఇటీవల అభిప్రాయపడ్డారు. కానీ, నేడు వివిధ దేశాలకు చెందిన విలేకరుల సమక్షంలో నేడు ఉత్తరకొరియా అణుపరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కిమ్‌తో భేటీని ట్రంప్ రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
ఎత్తుకు పైఎత్తులు..
పూర్తిస్థాయిలో అణుపరీక్షలను పూర్తి చేసుకున్న తర్వాతే కిమ్ చర్చలకు వచ్చాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దశలో ఉత్తరకొరియా పూర్తిస్థాయి అణ్వాయుధాలను తయారు చేసుకొనే సాంకేతికతను పొందిందన్నది నిఘా వర్గాల అంచనా. మరోపక్క ట్రంప్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చారు. కిమ్‌పై ఆంక్షల రూపంలో ఒత్తడి పెంచుతూనే చర్చల పేరుతో దారికి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఆంక్షల ఒత్తిడితో ఉత్తర కొరియా తన అణుపరీక్షా కేంద్రాలను ధ్వంసం చేసింది. వెంటనే చర్చలను రద్దు చేసిన ట్రంప్ మరింత బేరసారాలకు తెరతీశారు. ఈ నిర్ణయంపై కిమ్ ఎలా స్పందిస్తారనేది అందరు ఆసక్తిగా చూస్తున్నారు.