డ్రగ్స్‌కేసులో విచారణకు ప్రత్యేక కోర్టులు
` అంబేద్కర్ స్పూర్తితో తెలంగాణ ఏర్పాటు
` తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి స్వేచ్చ
` పోలీసులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా కాంగ్రెస్ పాలన
` సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వ సహకారం
` పైరవీలు లేకుండా పోలీస్ శాఖలో బదిలీల, పదోన్నతులు
` ప్రజా పాలన విజయోత్సవాలలో సిఎం రేవంత్ రెడ్డి
` హోం శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు
` పోలీస్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
` రాష్ట్రంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం ఙ
` 2 వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్‌ఎఫ్
` సిబ్బందికి శిక్షణ ఇప్పించిన ప్రభుత్వం
` ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ పోలీసుల ధైర్య సాహసాలు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఇందుకు వేదికగా మారింది హైదరాబాద్ లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ లో హోం శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా పలు స్టాల్స్ లను ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారులు వాటిని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. మహనీయులు అంబేద్కర్ స్పూర్తితో తెలంగాణ ఏర్పడిరదని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వేచ్చను ఇచ్చిందన్నారు. ఇప్పటికే తాము ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టామని, అదే రీతిలో ఏడో గ్యారంటీగా స్వేచ్చను అందించమని సీఎం అన్నారు. పోలీసులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకుందని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం అన్ని విధాలా పోలీసులకు సహకరిస్తుందన్నారు. అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారని, మరింత స్పీడ్ పెంచాల్సిన ఆవశ్యకత పోలీసులపై ఉందన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా పోలీస్ శాఖలో బదిలీల, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినట్లు సీఎం పునరుద్ఘాటించారు. హైదరాబాద్ అంటేనే డ్రగ్స్ విక్రయాలు నిర్వహించేందుకు భయపడే రీతిలో పోలీసులు విధులు నిర్వర్తించాలని సీఎం సూచించారు. అలాగే విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కూడా పోలీస్ శాఖ కూడా తన వంతు భాద్యత వహించాలని సీఎం సూచించారు. ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్స్ ను తీసుకొని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, సమాజ నిర్లక్ష్యానికి గురైన వారి విధులను పోలీస్ శాఖ సద్వినియోగం చేసుకుంటుందని తెలిపారు. ఉగ్రవాదుల ముప్పు సమయంలో గ్రేహౌండ్స్ బలగాలు ప్రాణాలు అర్పిస్తే వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తూ తోడ్పడుతుందన్నారు. తెలంగాణ హోం గార్డ్స్ కి జీతాలు పెంచినట్లు సీఎం శుభవార్త చెప్పారు. ఎవరైనా హోం గార్డ్స్ విధుల్లో ప్రాణాలు అర్పిస్తే, వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు అందిస్తామన్నారు. అంతేకాకుండా వారికి హెల్త్ కార్డ్ లు కూడా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, కొత్త సంవత్సరంలో నూతన ఆదేశాలు అమలవుతాయని సీఎం అన్నారు. పోలీస్ కుటుంబాల పిల్లల చదువుల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, అందుకు 50 ఎకరాలలో స్కూల్ నిర్మించడం జరుగుతుందని, హోం గార్డ్ నుండి డీజీపీ స్థాయి అధికారి పిల్లలకు ఉచిత విద్యను కార్పొరేట్ స్థాయిలో అందిస్తామని సీఎం వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో సుమారు 94 వేల మంది పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నారని, వారి కృషి ఉత్తమ విధులతోనే రాష్ట్రం శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పుడూ ముందంజలో ఉందని సీఎం అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళంను (ఎస్‌డీఆర్‌ఎఫ్) ప్రారంభించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ వేడుకలను నిర్వహించింది. ఈ క్రమంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విపత్తు దళానికి చెందిన బోట్స్‌ను కూడా సీఎం ప్రారంభించారు. భారీ అగ్నిప్రమాదాలు, భూకంపం, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు ఈ దళం అత్యవసర సహాయక చర్యలు చేపట్టనుంది. అగ్నిమాపక కేంద్రాలు ఇక నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్ స్టేషన్లుగా రూపాంతరం చెందనున్నాయి. జులై, ఆగస్ట్ నెలల్లో భారీ వర్షాలు కురవడంతో హైదరాబాద్, ఖమ్మం సహా పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో సుశిక్షితులైన దళం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ ను ఏర్పాటు చేయడంతో పాటు దీనిని ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35.03 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రాథమిక కోర్సులో శిక్షణ ఇప్పించారు.