డ్రగ్స్‌ను నెలరోజుల్లో నిర్మూలిస్తాం

3

– జలంధర్‌ సభలో రాహుల్‌

డ్రగ్స్‌ సమస్యను నెలరోజుల్లో పరిష్కరిస్తాం

రాహుల్‌గాంధీ

జలంధర్‌: వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యను నెలరోజుల్లో పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం పెరిగిపోవడానికి ప్రభుత్వమే కారణమని రాహుల్‌గాంధీ అన్నారు. డ్రగ్స్‌ వ్యాపారం వల్ల ప్రభుత్వం లాభపడుతోందని ఆయన ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే.. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలన్నారు. అది కేవలం కాంగ్రెస్‌కే సాధ్యమని రాహుల్‌ చెప్పారు.ఒక్కసారి ప్రజలు తమ పార్టీకి ఓటువేసి గెలిపిస్తే.. పంజాబ్‌లో మాదకద్రవ్యాలనేవే లేకుండా చేస్తామన్నారు. ఈ విషయంలో అకాళీదళ్‌ ప్రభుత్వం విఫలవమడానికి భాజపా కూడా కారణమన్నారు.

పంజాబ్‌ డ్రగ్స్‌ వ్యాపారానికి అడ్డుకట్ట పడాల్సిందే: రాహుల్‌

జలంధర్‌,జూన్‌13(ఆర్‌ఎన్‌ఎ): పంజాబ్‌లో అత్యంత తేలికైనది డ్రగ్స్‌ వ్యాపారమేనని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఒక్క నెలలోనే రాష్ట్రంలో డ్రగ్స్‌ లేకుండా చేస్తానని ఆయన చెప్పారు. పంజాబ్‌ లో పెరిగి పోయిన మత్తపదార్థాల వినియోగం, శాంతిభద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాహుల్‌ నాయకత్వంలో జలంధర్‌లో  సోమవారం అతిపెద్ధ ధర్నాకార్యక్రమం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని, పంజాబ్‌ లోని శిరోమణి అకాళీదళ్‌ ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ తీవ్రంగా విమర్శించారు.ఎప్పుడు చూసిన ప్రధాని నరేంద్రమోదీ వ్యాపారాల గురించే మాట్లాడుతారని, అవి కూడా తేలికైన వ్యాపారాల గురించేనని, పంజాబ్‌ లో అత్యంత తేలికైన వ్యాపారం డ్రగ్స్‌ అమ్మకాలేనని అన్నారు.

పంజాబ్‌ ప్రభుత్వం డ్రగ్స్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే దానికి డ్రగ్స్‌ మాఫియా నుంచి లబ్ధి చేకూరుతుంది. మేం ఆ సమస్యను పరిష్కరించగలం. అది కూడా ఒక్క నెలలోనే. అందుకోసం మాకు అధికారాన్ని అప్పగించండి. పోలీసులు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలి. ఆ పని కాంగ్రెస్‌ చేయగలదన్నారు. ఉడ్తా పంజాబ్‌ చిత్రానికి పెద్ద మొత్తంలో కట్‌ లు విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.