డ్రాగన్ దిగుమతులపై ట్రంప్ సుంకం
వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయంటున్న నిపుణులు
అమెరికా, జూన్15(జనం సాక్షి ) : చైనా దిగుమతులపై సుంకం విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. ఇదే జరిగితే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశముంది. ఇప్పటికే కెనడా, మెక్సికో, ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు విధించిన అగ్రరాజ్యం ఇప్పుడు చైనా ఉత్పత్తులపైనా సుంకాల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. చైనా అక్రమ వ్యాపార పద్ధతులకు చరమ గీతం పాడనున్నట్లు ఎన్నికల సమయంలో ప్రకటించిన ట్రంప్ ఆ హావిూని నిలబెట్టుకునేందుకే డ్రాగన్ ఉత్పత్తులపై సుంకాల కొరడా విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కనీసం 35 బిలియన్ డాలర్ల నుంచి 40 బిలియన్ల డాలర్ల వరకూ సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో సుంకాల మొత్తం 55 బిలియన్ డాలర్లకు చేరనుంది. అధికారిక ప్రకటన చేయడానికి ముందుగా గురువారం ట్రంప్ పలువురు కేబినెట్ మంత్రులను, వాణిజ్య సలహాదారులను కలిసి ఈ విషయం చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీయడమే కాకుండా కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాస్త్రరహితంగా మార్చే పక్రియపై ప్రతికూల ప్రభావం చూపే సూచనలున్నాయి.
అమెరికా దిగుమతులపై యూరోపియన్ దేశాలు భారీ సుంకం..
యూరోపియన్ దేశాల ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాలకు ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే విస్కీ, మోటార్ వాహనాలపై భారీగా సుంకాలు విధించాలన్న ప్రతిపాదనకు ఐరోపా సమాఖ్య(ఈయూ) ఆమోదం తెలిపింది. కెనడాలో జరిగిన జీ7 దేశాల సమావేశంలో సభ్య దేశాల సంయుక్త ప్రకటనను ట్రంప్ తిరస్కరించిన నేపథ్యంలో యూరోపియన్ దేశాల ప్రస్తుత నిర్ణయం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఐరోపా దేశాల నుంచి ఎగుమతి అయ్యే అల్యూమినియం, ఉక్కుపై భారీగా సుంకాలు విధిస్తూ ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై.. గుర్రుగా ఉన్న ఈయూ దేశాలు అమెరికా ఉత్పత్తులపై 2.8 బిలియన్ డాలర్ల మేర సుంకాలు విధించాలని నిర్ణయించాయి. ప్యారిస్ వాతావరణ ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందం, జెరూసలెంలో అమెరికా దౌత్య కార్యాలయం ఏర్పాటు వంటి ఘటనల నేపథ్యంలో ఇటీవల ఫ్రాన్స్, అట్లాంటిక్ సంబంధాలు క్షీణదశకు చేరుకున్నాయి.