డ్రెయిన్లలో తూడు తొలగించాలి

ఏలూరు,జూన్‌22(జ‌నం సాక్షి ): కొద్దిపాటి వర్షానికే వందల ఎకరాలు ముంపునకు గురవుతున్న పరిస్థితులు రైతులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా మేజర్‌, మైనర్‌ డ్రెయిన్లలో ఉన్న ఆక్రమణలనుతొలగించడంతో పాటు డ్రెయిన్లలో ఉన్న వలకట్లు, గుర్రపుడెక్క, తూడు వంటి వాటిని తొలగించాలని రైతులు డిమాండు చేస్తున్నారు. కొద్దిపాటి వర్షాలకే ప్రధాన డ్రెయిన్లు పొంగిపోయి సవిూపంలోని వరి పొలాలను ముంచెత్తుతున్నాయి. ప్రధానమైన డ్రెయిన్లతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న మైనర్‌ డ్రెయిన్లలో భారీగా పెరిగిపోయిన ఆక్రమణల వల్ల ముంపునీరు దిగే మార్గం లేకపోవడంతో రైతులు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వర్షాకాలం సవిూపించినందున ముందుగా వీటిని క్లీయర్‌ చేయాలని కోరుతున్నారు. అయినప్పటికీ డ్రెయినేజీ శాఖ అధికారుల్లో స్పందన కరువైంది. అనేక డ్రెయిన్లను ఆనుకుని మేజర్‌, విూడియం, మైనర్‌ డ్రెయిన్లు ఉన్నాయి. సవిూపంలోని పొలాల నుంచి వచ్చే మురుగునీరు ఈ డ్రెయిన్‌ల గుండానే దిగి సవిూపంలోని గోదావరి నదీ పాయల్లోకి చేరుతుంది. అయితే ఇటీవలి కాలంలోడ్రెయిన్‌ గట్లను లక్ష్యంగా చేసుకుని ఆక్వా రైతులు చెరువులు తవ్వేశారు. ఎక్కడికక్కడే అడ్డుకట్టలు వేశారు. ప్రధాన డ్రెయిన్ల గట్లపై అతిథిగృహాలు, రొయ్యల చెరువులకు సంబంధించిన అవుట్‌లెట్లు వంటివి ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా ఆక్వా సేద్యాన్ని చేస్తున్నారు. మరికొందరైతే డ్రెయిన్‌ గట్ల లోపల చెరువులు తవ్వడం, వ్యవసాయం చేయడం, కొబ్బరి మొక్కలు నాటడంతో పాటు- కొన్ని కీలక ప్రాంతాల్లో మత్స్యకారులు, సవిూపంలోని రైతులు వలకట్లు వేసి మత్స్య సంపద కోసం చేస్తున్న ప్రయత్నాలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నంది. డ్రెయిన్‌ను ఆనుకుని ఉన్న వేలాది ఎకరాలకు వర్షాకాలం వచ్చిందంటే ముంపు బెడద తీవ్రమవుతుంది. సవిూపంలోని ఇళ్లల్లోకి నీరు కూడా చేరుకుంటోంది. ముంపు తీవ్రత పెరిగిపోయి వందలాది ఎకరాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తక్షణమే కుమ్మరి కాల్వ డ్రెయిన్‌లో పూడికను తీయడంతో పాటు ఆక్రమణలు తొలగించాలని, అక్విడెక్టు పునర్నిర్మాణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు.