డ్రైనేజీలో పడి యువతి మృతి

– ఢిల్లీలో అర్థరాత్రి ఘోర ఘటన
న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : ప్రభుత్వ ఉదాసీనతకు విలువైన ప్రాణాలు బలైపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కోరలు చాచుకుని మురుగు నీటి గుంతలు నడిరోడ్డుపై కనిపిస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన దారుణం ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే. రేడియో మిర్చి మార్కెటింగ్‌ టీమ్‌లో పని చేస్తున్న తాన్యా ఖన్నా (26) మంగళవారం రాత్రి 2.30 గంటల సమయంలో నోయిడాలోని సెక్టర్‌ 94 రోడ్డులో ఉన్న మురుగు నీటి గుంతలో పడిపోయారు. ఆమె తన వెర్నా కారుతో సహా ఈ గుంతలో పడిపోయారు. ఆమె ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ నీటి గుంత దగ్గరకు వచ్చేసరికి ఆమె తన కారుపై పట్టు కోల్పోయినట్లు తెలుస్తోంది. కారు వేగంగా మురికి నీటి గుంతలోకి దూసుకెళ్ళిపోవడాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి, సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఆ కారులోని తాన్యా ఖన్నాను బుధవారం ఉదయం బయటికి తీసి, ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్థారించారని చెప్పారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు. తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.