ఢిల్లీలో రెండో దశ సరి-బేసి విధానం అమలు

2న్యూఢిల్లీ:  ఢిల్లీలో మరోమారు సరి, బేసి నియమం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. నగర రోడ్లపై వాహన రద్దీని, కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో అమలుచేస్తున్న ఈ నియమం ప్రకారం ఇవాళ్ట నుంచి 30 వరకు సరి నంబరు ప్లేటున్న కార్లు సరి తేదీల్లో, బేసి నంబరున్న కార్లు బేసి తేదీల్లో రోడ్లపైకి రావలసి ఉంటుంది.

సీఎన్జీ స్టిక్కరు కలిగిన వాహనాలు, బ్యాటరీ హైబ్రిడ్‌ వాహనాలు, ఒంటరి మహిళలు నడిపే వాహనాలు, యూనిఫామ్‌ ధరించిన స్కూలు పిల్లలున్న కార్లను, వికలాంగుల కార్లను, ద్విచక్రవాహనాలకు ఈ నియమం నుంచి మినహాయింపునిచ్చారు. ఈ సందర్భంగా సరి,బేసి నియమాన్ని అందరూ పాటించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన్ ట్విట్టర్లో కోరారు. ఈ విధానాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా తొలిదశలో అమలు చేసిన సరి, బేసి నియమం విజయవంతమైన విషయం తెలిసిందే.

ఇలా ఉండగా శుక్ర, శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలు కావడం, ఆదివారం దీనికి మినహాయింపు ఉండడం వల్ల సోమవారం నుంచే అసలు పరీక్ష ప్రారంభం కానుంది. ప్రభుత్వం మాత్రం రెండో దశను కూడా విజయవంతంగా అమలుచేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. స్కూలు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్కూలు బస్సులకు కోత విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశముంది.