ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ ట్యాంక్‌ బండ్‌పై మహిళల ప్రదర్శన

 

 
హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) :

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం సాయంత్రం మహిళలు హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళా హక్కులు కాపాడలని, రక్షణ చర్యలు చేపట్టాలని, అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, ఢిల్లీలో నడిరోడ్డుపై నడుస్తున్న బస్సులో యువతిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారకులైన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో రోజురోజుకు మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయని, మన చట్టాల్లో ఉన్న లోపాలతోనే దుర్మార్గులుఇలాంటి ఘటనలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. చట్టాల్లో మార్పులు తెచ్చి ఇంకెవరూ అకృత్యాలు, అన్యాయాలకు పాల్పడకుండా శిక్షలు అమలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగానే దేశరాజధానితో పాటు వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయని, ఇందుకు పాలకుల నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. ఈ ప్రదర్శనలో పది వేల మంది వరకు మహిళలు పాల్గొనడంతో ట్యాంక్‌బండ్‌ మొత్తం వారితో నిండిపోయింది. వీరి ఆందోళనకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.