ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

DELHI-CM-KCR-VSమూడు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ టూర్ లో అనేక కీలకాంశాలను సీఎం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు.

శనివారం ప్రధాన మంత్రి అధ్యక్షతన 11వ అంతర్రాష్ట్ర మండలి సదస్సు జరగనుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ భేటీ జరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు సీఎస్ రాజీవ్ శర్మ కూడా పాల్గొంటారు. నాలుగు అంశాలు ప్రధాన ఎజెండాగా, మరో నాలుగు అంశాలు సబ్ ఎజెండాగా మీటింగ్ ను నిర్వహించబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాల్లో ఆధార్ ప్రగతి, అంతర్గత భద్రత, ప్రత్యక్ష నగదు బదిలీ అంశాలపై ఈ సదస్సులో చర్చ జరగనుంది. వీటితోపాటు విద్యా విధానంలో మార్పులు, ఎన్జీవో ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ దర్పన్ పథకం, అంతర్రాష్ట్ర సమస్యలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై కూడా చర్చించనున్నారు.