తక్షణమే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):వచ్చే నెల 2 , 3వ తేదీల్లో హైదరాబాద్ లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందుగానే   ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.లేని పక్షంలో పీఎం, కేంద్ర మంత్రులు నిరసన ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాల బిజెపి కమిటీలు చొరవ తీసుకుని ఒప్పించాలని,లేనిపక్షంలో జరుగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.గత 28 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి బలపరుస్తున్న పార్టీ బిజెపి అని చెప్పారు. ప్రతి  ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చిన అంశమైన ఎస్సీ వర్గీకరణను చేయాలన్నారు.గతంలో యుపిఎ ప్రభుత్వానికి బీజేపీ లేఖను రాసిన విషయాన్ని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తూ , ఆచరణలో విఫలమైందని దుయ్యబట్టారు.దేశస్థాయిలో బిసీ వర్గీకరణకు జస్టీస్ రోహిణి కమిటీ వేశారని తెలిపారు.ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీకి చిత్త శుద్ది లేదని ఆక్షేపించారు.కేంద్రం సిద్దపడితే వర్గీకరణ బిల్లు పాస్ అవుతుందన్నారు.గతంలోనే అన్ని రాజకీయ పార్టీలతో లేఖలు రాయించామని,కేంద్ర భాజపా అగ్ర నాయకులు కూడా గతంలో మద్దతు తెలిపారని పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ ఆవేదనను చాటుకోడానికి జులై 2న  ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్ర రహదారులను దిగ్భందిస్తామని , 3న ఛలో హైదరాబాద్ కార్యక్రమల్లో భాగంగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను  ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అడ్డుకోని తీరుతామని  ప్రకటించారు.ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలసి రావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న , చింతలపాటి చిన శ్రీరాములు ,బోడ శ్రీరాములు ,ఎర్ర వీరస్వామి , గ్యార కనకయ్య, ముల్కలపల్లి రవి , కత్తుల విద్యాసాగర్, చెర్కుపల్లి చంద్ర శేఖర్, పుట్టల మల్లేష్ , దైద వెంకన్న , కొంగర సైదులు‌, దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.