తగ్గుతున్న ఆడపిల్లల సంఖ్య

కోల్‌సిటీ, జనంసాక్షి: జిల్లాలో దశాబ్దంగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందినేది వైద్య, ఆరోగ్యశాఖ నివేదికల సారాంశం. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది బాలురకు 962 మంది బాలికలు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 937 మందికి పడిపోయింది. గర్భధారణ సమయంలోనే స్కానింగ్‌ కేంద్రాలకు వెళ్లడం.. ఆడా.. మగా తెలుసుకోవడం రివాజుగా మారుతోంది. వీరి ఆసక్తిని స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు ‘క్యాష్‌’ చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
హృదయ విదారకం.. ఈ ఘటనలు
కోహెడ, జనంసాక్షి: కోహెడ మండలం సముద్రాల సాయిబాబా ఆలయం సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు తుమ్మపొదళ్లలో పడేశారు. చీమలు కుట్టగా శిశువు కేకలు విని గ్రామస్తులు అక్కున చేర్చుకున్నారు. ఐసీడీఎస్‌ అధికారులు వెంటనే హుస్నాబాద్‌లో ప్రథమ చికిత్స చేయించి, కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ సమీపంలో మహిళ తన ఏడాది కూతురును, మరో మహిళకు విక్రయించబోతుంటే.. మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. వీరిద్దరు పాపతో పారిపోయారు.
సిరిసిల్ల: సుభాష్‌నగర్‌లో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని మనస్థాపంతో కుసుమ రుచిత అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కోరుట్ల: నక్కలగుట్టకాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు తుమ్మపొదళ్లలో ఆడ శిశువును పడేశారు. పోలీసులు శిశువును ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఎందుకీ వివక్ష?…………
ప్రభుత్వపరంగా విద్యా సంక్షేమ పథకాలు అనేకం అందుబాటులో ఉన్నా ఆడపిల్లలను పెంచడం భారమని కొందరు తల్లిదండ్రులు భావిస్తున్నారు.
ఆడపిల్లల భరోస కోసం…
బాలిక సంరక్షణ యోజన: 2005-06 నుంచి ఈ పథకం జిల్లాలో అమలవుతోంది. తల్లిదండ్రులకు ఊరట కలిగించేందుకు బాలిక చదువు, వివాహానికి ఈ పథకం తోడ్పడుతుంది. ఒక్క కూతురైతే రూ. లక్ష, ఇద్దరు కూతుళ్లయితే రూ. 60 వేలు చొప్పున ఐసీడీఎస్‌ అధిదకారులు పంపిణీ చేస్తారు. గ్రామాల్లో రూ. 20 వేలు, పట్టణాల్లో రూ. 24 వేల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు దీనికి అర్హులు.
కిశోర బాలికల పథకం
ఈ పథకం ద్వారా జిల్లాలో 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 18ఏళ్లలోపు బాలికలకు ఏటా 160 మందికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తూ ఉపాధి కల్పిస్తున్నారు.
బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు
నిరుపేదలైన బాలికలు చదువుకోవడం కోసం కస్తూరిబాగాంధీద పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 42 కస్తూరిబాగాంధీ పాఠశాలలు ఉన్నాయి. ఇతర శాఖల ఆధ్వర్యంలో తొమ్మిది పాఠశాలల్లో వేలాది మంది బాలిలు చదువుతున్నారు. పిల్లల విషయంలో దంపతుల్లో అపోహలు ఉంటే కౌన్సెలింగ్‌ చేయాలి. ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టాలి. నిందితులకు కఠినశిక్షలు వేయాలి. బాలికలలకు ప్రభుత్వ పరంగా అందే ప్రోత్సాహకాలపై ప్రచారం చేయాలి. అంగన్‌వాడీ, ఐకేపీ, ఆరోగ్యకేంద్రాల సిబ్బందితో ప్రతీ నెలా ఆడపిల్లల వివక్ష పోగొట్టడానికి కార్యక్రమాలు నిర్వహించాలి.