తమిళంలో ఆఫర్ కొట్టేసిన చాందిని
తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో అగ్రకథానాయికలుగా ఎదిగే యోగం లేదని చాలా సార్లు ప్రూవ్ అయింది. వారిలో చాలా మంది ఇతర భాషల్లో టాప్ హీరోయిన్స్ గా చెలామణి అయ్యారు. తాజాగా ఆ జాబితాలోకి చేరిన మరో తెలుగమ్మాయి చాందినీ చౌదరి. విశాఖపట్నానికి చెందిన ఈ అమ్మాయి మెకానిక్ ఇంజినీరింగ్ చదివి.. సినిమాలపై పేషన్‌తో కథానాయిక అవ్వాలనుకుంది. ఆ క్రమంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ, యూట్యూబ్ సిరీస్ లోనూ నటించింది. కొన్ని సినిమాల్లో చిన్న చిన్నపాత్రలు పోషించింది. సుహాస్ హీరోగా నటించిన ’కలర్‌ఫోటో’ చిత్రంతో చాందిని కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా నేషనల్ అవార్డ్‌ను గెలుచుకోవడం ఆమెకు ప్లస్ అయింది. ఇటీవల విడుదలైన ’సమ్మతమే’ చిత్రంతో కూడా హీరోయిన్‌గా మంచి మార్కులేయించుకుంది. అయితే చాందిని చౌదరి కేవలం తెలుగు సినిమాల్నే నమ్ముకోవడం లేదు. మంచి స్క్రిప్ట్ వస్తే ఇతర భాషల్లోనైనా నటించే ఆలోచనలో ఉంది. దానికి తగ్గట్టుగానే కోలీవుడ్ నుంచి ఓ మంచి అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఈ విషయాన్ని చాందిని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అధికారికంగా తెలియచేసింది. కోలీవుడ్‌లోని ఓ అగ్ర నిర్మాణ సంస్థ క్రేజీ ప్రాజెక్ట్‌లో చాందిని మెయిన్ లీడ్‌లో నటించబోతున్నట్టు సమాచారం. కోలీవుడ్‌లో నిలకడగా విజయాలు అందుకుంటే.. మాత్రం చాందిని అగ్రకథానాయిక అవడం ఖాయం అంటున్నారు.ఆకర్షించే అందంతో పాటు, ఆకట్టుకొనే అభినయం చాందిని చౌదరి సొంతం. ప్రస్తుతం ’గామి’ అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే ఆమె నటించే తమిళ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. మరి తెలుగు నుంచి తమిళంలోకి వెళ్ళి అగ్రకథానాయికలుగా మెరిసిన కొందరు తెలుగమ్మాయిల జాబితాలో కూడా చాందిని చౌదరి చేరుతుందేమో చూడాలి.