తమిళనాడుకు నీళ్లిస్తారా లేదా?

– ఆదేశాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు
– కర్ణాటకకు హెచ్చరికలు జారీచేసిన సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, మే3(జ‌నం సాక్షి) : కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. తమిళనాడుకు నీళ్లు విడుదల చేస్తారా లేక పరిణామాలను ఎదుర్కొంటారా అంటూ తీవ్రంగా స్పందించింది. మే నెలకుగాను తమిళనాడుకు 4టీఎంసీల నీరు విడుదల చేయాలని స్పష్టంచేసింది. ప్రధాని మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న కారణంగా కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయలేకపోతున్నామన్న ప్రభుత్వ వాదనను కూడా కోర్టు తప్పుబట్టింది. అసలు తమిళనాడుకు నీటి విడుదల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. విూరిప్పటికే ఓ ప్రణాళిక తయారు చేయాల్సింది అని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా.. ప్రభుత్వ తరఫు న్యాయవాదిని నిలదీసింది. ఇప్పటికే ఈ ప్రణాళికను కేబినెట్‌ ముందు ఉంచామని, అయితే ప్రధాని, ఇతర మంత్రులు కర్ణాటకలో ఉన్నారని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. ఈ ప్రణాళికలో నిపుణల కంటే మంత్రులు ఉంటేనే బాగుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. మాకు ఎన్నికలతో సంబంధం లేదు. ఇప్పటికే నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేయాల్సింది. ఇందులో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర లేదు అని చీఫ్‌ జస్టిస్‌ స్పష్టంచేశారు. కేంద్రం ఈ అంశాన్ని రాజకీయం
చేస్తున్నదని తాము వేసిన పిటిషన్‌లో తమిళనాడు ఆరోపించింది. కర్ణాటక ఎన్నికలే కేంద్రానికి ముఖ్యమయ్యాయని, ఇది సహకార సమాఖ్య రాజకీయాలకు తెర వేసినట్లే అవుతుందని తమిళనాడు వాదించింది. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా ఇచ్చిన తమ ఆదేశాలను కేంద్రం పట్టించుకోకపోవడంపై కూడా కోర్టు మండిపడింది. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. మే 8న కేసుపై తిరిగి విచారణ జరుపుతామని, ఆ రోజు అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
————————————————–