తమ వంతు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్న దృక్పథం ప్రతి ఒక్కరికీ ఉండాలి.

 అదనపు కలక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.
సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 17:(జనం సాక్షి):
రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ పై యాత్ర చేస్తూ ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పొన్నాల గౌరీ శంకర్ సోమవారం సంగారెడ్డి జిల్లాకు చేరుకుని  అదనపు కలెక్టర్ రాజర్షి షా ను కలిసారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఆయన సైకిల్ పై చేసిన యాత్రల గురించి రాజార్షికి వివరించారు. గౌరీ శంకర్ చేస్తున్న సైకిల్ యాత్ర ను రాజార్షి అభినందించారు.
ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రోత్సాహం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సైకిల్ యాత్ర చేస్తూ సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతున్న తీరును, ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 12 నుండి సైకిల్ యాత్ర ప్రారంభించారని, ఇప్పటివరకు యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లా చేరుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుండి మెదక్ జిల్లాకు వెళ్ళ నున్నట్లు చెప్పారు.
అందరికీ ఉచిత విద్య , ఉచిత వైద్యం వంద శాతం అందుతే బాగుంటుందని ప్రజల నుండి సలహాలు అందుతున్నాయన్నారు. ప్రజా సమస్యలు, సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.