తల్లిడిల్లుతున్న ‘కన్నపేగు’..

నిజామాబాద్ : నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ కాసేపు కూడా తన ఒడిలో లేదు. పుట్టిన కాసేపటికే మాయదారి జ్వరం పండంటి బిడ్డను చుట్టేసింది. పెద్దాసుపత్రికి తీసుకెళ్తె నయమవుతుందని చెబితే పసిగుడ్డును చేతిలో పట్టుకుని నాందేవ్‌వాడకు చెందిన అనే బాలింత నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. పరీక్షలు చేసిన వైద్యులు కామెర్లు అయ్యాయని, ఇంక్యూబేటర్‌లో పెట్టాలని చెప్పారు. ఎన్ఎస్ సియు లో ఉంచితే నయమవుతుందని చెప్పుకొచ్చారు. కన్నబిడ్డకు నయమయితే చాలనుకున్న అనిత తన బిడ్డను ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించింది.
పొంతన లేని సమాధానాలిచ్చిన సిబ్బంది..
మరుసటి రోజు తెల్లవారుఝామున బిడ్డ ఆరోగ్యం గురించి ఆరా తీసిన అనితకు ఎన్ఎస్ సియు సిబ్బంది పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. కాసేపు ఎన్ఎస్ సియు వార్డుకు తాళం వేసి, సమాలోచనలు జరిపిన సిబ్బందినీ ఆడబిడ్డ కన్పించటం లేదంటూ చెప్పారు. మరి కాసేపటికి మాట మార్చి మీరే తీసుకవెళ్లారుగా అంటూ తప్పు అనిత కుటుంబ సభ్యుల మీదకు తోసేసేందుకు ప్రయత్నించారు. ముక్కుపచ్చలారని బిడ్డ కన్పించకపోయేటప్పటికి అనిత కన్నీరు మున్నీరుగా విలపించింది. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఘటన జరిగి 13 రోజులవుతున్నా నేటికి ఆడబిడ్డ ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
విధుల నుంచి నర్సు తొలగింపు..
ఆడబిడ్డ అదృశ్యాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు విధుల్లో ఉన్న నర్సును తొలగించారు. ఇద్దరు వైద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కానీ పోలీసులు మాత్రం తొలిరోజు ప్రదర్శించిన ఆసక్తిని కొనసాగించలేదు. బిడ్డ అదృశ్యమైందని తెలిసిన రోజు చేసిన హడావుడిని, త్వరలోనే నిందితులను పట్టుకుని ముక్కుపచ్చలారని బిడ్డను నీ ఒడికి చేరుస్తామని అనితకు ఇచ్చిన వాగ్ధానాలను మరిచారు. ఇప్పటికైనా కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ మిస్టరీని చేధించాలని బాధితులు వేడుకుంటున్నారు.