తహసీల్దార్ కార్యాలయంలో రైతుహల్‌చల్
– కంప్యూటర్‌పై పెట్రోల్ చల్లి అధికారులకు బెదిరింపులు
– అదుపులోకి తీసుకున్న పోలీసులు
– కరీంనగర్ జిల్లాలో ఘటన
కరీంనగర్, నవంబర్19(జనం సాక్షి) : విజయారెడ్డి ఉదంతం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులపై రైతులు రెచ్చిపోతున్నారు. తమ పనులు చేయటం లేదంటూ పెట్రోల్ బాటిళ్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. పలు సమస్యలు పరిష్కారం కానివిఉన్నా.. అధికారులే ఆలస్యం చేస్తున్నారన్న అనుమానంతో రైతులు అదుపుతప్పి పెట్రోల్ బాటిళ్లతో బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తహశీల్దార్ పాస్‌పుస్తకం ఇవ్వడంలేదన్న కారణంతో ఓ రైతుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తహశీల్దార్ కార్యాలయంపై ఏకంగా పెట్రోల్‌తో దాడికి దిగాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎమ్మార్వో కార్యాలయంలో చోటుచేసుంది. లంబాడిపల్లికి చెందిన రైతు కనకయ్య తన పొలం పాస్‌పుస్తకాల కోసం గత కొంతకాలంగా తిరుగుతున్నాడు. కానీ పనిమాత్రం కావడంలేదు. రేపుమాపు అంటూ అధికారులు తిప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కార్యాలయానికి వచ్చిన కనకయ్య తనతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో హల్‌చల్ చేశాడు. పాస్‌పుస్తకం ఇవ్వడంలేదని ఆఫీసులోని కంప్యూటర్లపై పెట్రోల్ పోశాడు. దీంతో వెంటనే తేరుకున్న అక్కడున్న సిబ్బంది ఆయన్ని వెంటనే బయటకు తోసేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. కనకయ్య పెట్రోల్‌తో రావడంతో కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటరతో తహశీల్దార్ ఆఫీసు వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా రైతులు అదుపుతప్పి ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండటం పట్ల అధికారుల్లో కలవలం రేపుతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు చేయకలిగే పనులైతే తాము చేస్తామని, తమ పరిధిలో లేని పనులను తామే చేయాలంటే ఎలా అవుతాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదం సమస్యలు ఉన్నప్పుడు ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చితేనే సమస్య పరిష్కారం అవుతుందని, కానీ ఇరు వర్గాలు పోటాపోటీగా ఉన్నప్పుడు ఆ సమస్యను మేమెలా పరిష్కరిస్తామని, అది కూడా అర్థంచేసుకోలేని పులువురు రైతులు తమపై కక్షపెంచుకోవటం సరికాదని అధికారులు ఆవేదన చెందుతున్నారు.