తహసీల్దార్ కార్యాలయం దిగ్బంధం చేసిన విఆర్ఏలు.
బెల్లంపల్లి, అక్టోబర్10, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో కార్యాలయాన్ని దిగ్బంధం చేసి తహసీల్దార్ మరియు ఇతర సిబ్బంది కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. జోరు వానలో విఆర్ఏలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యాలయం ముందు గేటు వద్ద ఎవరు లోపలికి వెళ్లకుండా బైఠాయించారు. దీనితో కార్యాలయం పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 78 రోజులుగా విఆర్ఏలు సమ్మెబాట పట్టినప్పటినుంచి రెవెన్యూ పనులు మందకొడిగా సాగుతున్నాయని కార్యాలయానికి వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈకార్యక్రమంలో విఆర్ఏ జేఏసీ నాయకుడు మహేందర్, విఆర్ఏలు పాల్గొన్నారు.