తానే….బాధ్యుడు!

ఇక్కడ
ఏడుపు పెడబొబ్బలు
సావు డప్పుల నడుమ
శవ యాత్ర సాగుతోంది

ఆక్కడ
మాటలు నేర్చిన జిత్తులమారి నక్క
సినిమా టికెట్ల “క్యూ” కూ…
కరువు ఎరువు “వరుస”కు
జతకట్టి “సావు” కారణం తేల్చేసింది

మరోచోట
ఢిల్లీ గద్దె తాలూక పీతిరిగద్ద
నెపాన్ని పక్కోడి మీదకు నెట్టి
సక్కని పూసలమంటూ
సన్నాయి నొక్కులు నొక్కింది

యూరియా బత్త కొరకు
ఊపిరి పోగొట్టుకున్న
రైతు “ఎల్లయ్య” మాత్రం మట్టిల గలిసిండు

ఇప్పుడు
ఏ కేసులు, విచారణలు ఉండవు
ప్రత్యక్ష పరోక్ష కారకులుండబోరు
ఎవ్వరికీ…
ఏ శిక్షలు ఖరారు కావు

భూమిని దున్ని
పట్టెడు మెతుకులు పండించాలని
ఆశపడటమే “ఎల్లన్న” చేసిన నేరం
ఈ దేశంలో పుట్టడమే మహాపాపం

అందుకే!
తన చావుకు తానే బాద్యుడు

               “”””””””””””
(యూరియా కొరకు ప్రాణాలు పోగొట్టుకున్న
రైతు “ఎల్లయ్య’కు అక్షర నివాళులర్పిస్తూ…)
.
కోడిగూటి తిరుపతి
(జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత)
Mbl no: 957౩929493