తాలిబన్లతో పోరాడిన మహిళా గవర్నర్‌ లొంగుబాటు


పలుచోట్ల తాలబన్లకు వ్యతిరేకంగా మహిళల నిరసన
న్యూస్‌ ఛానళ్లలో మహిళా యాంకర్ల తొలగింపు
కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఒకప్పుడు తాలిబాన్లతో పోరాడటానికి తుపాకీ పట్టిన అఫ్ఘనిస్థాన్‌ మొట్టమొదటి మహిళా గవర్నర్‌ సలీమా మజారీ పట్టుబడ్డారు. తాలిబాన్ల రాకతో చాలామంది అఫ్ఘనిస్థాన్‌ రాజకీయ నాయకులు దేశం విడిచి పారిపోతున్న సమయంలో మహిళా గవర్నర్‌ సలీమా మజారీ బాల్ఖ్‌ ప్రావిన్సులో తాలిబాన్లకు లొంగిపోయారు. తాలిబాన్‌ తిరుగుబాటుదారులు అఫ్ఘాన్‌ దేశంపై నియంత్రణ సాధించిన తర్వాత దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో సహా పలువురు దేశం విడిచి పారిపోయారు. కాని గతంలో తాలిబాన్లపై పోరాడేందుకు తుపాకీ చేత పట్టిన సలీమా మాజారీ వారికి చిక్కారు. మహిళా గవర్నరు అయిన సలీమా భయపడి దేశం విడిచి పారిపోకుండా అత్యంత ధైర్యసాహసం చూపారు. చార్కింట్‌ గవర్నరుగా పనిచేసిన సలీమా మజారి రైతులు, గొర్రెల కాపరులు, కార్మికులతో కలిసి తాలిబాన్లకు వ్యతిరేకంగా
పోరాడారు. ఇదిలావుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళా బృందం బహిరంగంగా నిరసన తెలిపింది. తమ హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేసింది. తాలిబన్‌ల వశమైన ఆఫ్ఘన్‌ నుండి వేలాది మంది ఇతర దేశాలకు పారిపోతున్న సమయంలో కాబూల్‌ వీధుల్లో ఒక మహిళా బృందం ధైర్యంగా తమ ఆందోళనను తెలిపింది. తాలిబన్‌ దేశంలో ఇదే మొదటి మహిళల అందోళన కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను ఇరానియన్‌ జర్నలిస్ట్‌ మాసిప్‌ా అలిన్జాద్‌ పోస్ట్‌ చేశారు. తాలిబన్‌ సైన్యం చుట్టుముట్టినప్పటికీ.. చేతి రాతతో రాసిన ఫ్లకార్డులను నలుగురు మహిళలు ప్రదర్శిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. సామాజిక భద్రత, పనిచేసేహక్కు, విద్యహక్కు, రాజకీయంలో భాగస్వామ్య హక్కుతో పాటు మహిళల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొన్నేళ్ల పాటు తాము సాధించిన విజయాలను, ప్రాథమిక హక్కులు రాజీపడ కూడదని ఆ మహిళలు పేర్కొంటున్నారు. మరోవైపు ఆఫ్ఘన్‌లోని ప్రధాన విూడియా సంస్థ టోలో న్యూస్‌ దేశం తాలిబన్‌ల వశం కావడంతో తొలగించిన మహిళా యాంకర్‌లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం గమనార్హం. అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు అక్కడి మహిళా యాంకర్లపై నిషేధం విధించారు. ప్రభుత్వ న్యూస్‌ ఛానళ్లలో పనిచేస్తున్న మహిళా న్యూస్‌ యాంకర్లను తొలగించారు. ఇకపై తాలిబన్‌ యాంకర్లు మాత్రమే టీవీ న్యూస్‌ చదవనున్నారు. ప్రభుత్వ న్యూస్‌ ఛానల్‌లో పనిచేస్తున్న ఖదీజా అవిూన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇకపై కేవలం షరీయత్‌ చట్ట ప్రకారమే మహిళలు పనిచేయాల్సి వుంటుందని తాలిబన్‌ నేతలు తెలిపారు. ఉద్యోగం కోల్పోయిన ఖదీజా అవిూన్‌ మాట్లాడుతూ ’ఇకపై నేను ఏం చేయాలి? రాబోయే తరాలకు పని ఉండదు. గడచిన 20 ఏళ్లలో మేము సాధించినదంతా వృథా అయిపోయింది. తాలిబన్లు తాలిబన్లే… వారిక మారరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.