తితిదే వేదికగా భాజపా మహాకుట్రకు తెరదీసింది

– పవన్‌ గాలి మాటలు వినే రకం
– ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
అమరావతి, జూన్‌22(జ‌నం సాక్షి ) : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతిసేలా కొందరు కుట్ర చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తితిదే వేదికగా భాజపా, వైకాపా, జనసేన పార్టీ కుట్ర రాజకీయాలకు తెర తీశాయని… దీన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ ప్రతిష్ట పెరిగిందని పేర్కొన్నారు. మ హయాంలో తిరుమల కొండపైకి తెలుగు గంగ తీసుకెళ్లామని, రోడ్లు, విద్యుత్‌, మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామని, వ్యవస్థలో క్రమశిక్షణ తీసుకొచ్చామని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. పరిశుభ్రతలో తితిదేకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉందన్నారు. చంద్రబాబుకు వెంకన్న కులదైవమని… అలాంటి వ్యక్తిపై కుట్ర రాజకీయలు చేయడం, స్వామివారి ఆభరణాల విషయంలో ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తితిదే వేదికగా భాజపా మహాకుట్రకు తెరతీసిందని.. ఈ కుట్రలో జనసేన, వైకాపా ప్రధాన సూత్రధారులుగా ఉన్నాయని ఆరోపించారు.
పవన్‌ అంటే గాలి… గాలి వార్తలు నమ్మి వాటిని చెప్పడం తప్ప ఆయనకు ఆలోచించే శక్తి లేదన్నారు. పవన్‌ ఒక అజ్ఞాత వాసి..  రీల్‌ లైఫ్‌ వేరు.. రియల్‌ లైఫ్‌ వేరు. ఎవరో రాసిచ్చిన స్కిప్ట్‌ చదవడం ఆయనకు
అలవాటుగా మారిందని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ఉండే వారు బాధ్యతగా మెలగాలని, విశ్వసనీయత లేని రమణ దీక్షితులు లాంటి వ్యక్తులకు పవన్‌ మద్దతు తెలపటం రాజకీయ కుట్రే అన్నారు. ఎన్డీయే నుంచి తెదేపా బయటకి వచ్చిన తరువాతనే ఇలంటి ఆరోపణలు చేస్తున్నారని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఇప్పటికైన పవన్‌ స్వతహాగా ఆలోచించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు.