తీర ప్రాంత భూముల్లో ఆక్రమణలు తొలగిస్తాం
శ్రీకాకుళం, జూన్ 25 : జిల్లాలోని తీర ప్రాంతాల్లో గల ప్రొటెక్ట్ ఫారెస్ట్, సెక్షన్-4 నోటిఫైడ్ ఏరియా ఆటవీ భూముల్లో ఆక్రమనలను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఆటవీ అధికారి మహ్మద్ తయ్యబ్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని ఆయన కార్యాలయంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తయ్యబ్ మాట్లాడుతూ, జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి రణస్థలం మండలం వరకు విస్తరించి ఉన్న 193 కిలో మీటర్ల తీర ప్రాంతంలో ఆటవీ శాఖ పరిధిలో సుమారు రెండువేల హెక్టార్ల భూములున్నాయన్నారు. వీటిలో 107.6 ఎకరాలు ఆక్రమనాలకు గురైనట్లు గుర్తించామని చెప్పారు. ఆక్రమనలకు పాల్పడిన 101 మందిపై కేసులు నమోదు చేశామని మరికొందరిని గుర్తించి వారిపై కూడా కేసులు నమోదుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆటవీ శాఖ పరిధిలో గల తీర ప్రాంతంలో ప్రస్తుతం 500 హెక్టార్లలో సరుగుడు మొక్కలున్నాయన్నారు. మరికొన్ని మొక్కలు నాట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆటవీ శాఖ పరిధిలో గల తీర ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు, నిర్మాణాలు చేపట్టరాదని ఎవరైనా నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి పొందాలని ఆయన చెప్పారు.