తుదివిడతకు సన్నాహాలు పూర్తి
ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు
జనగామ,జనవరి28(జనంసాక్షి): తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో పంచాయితీల్లో ప్రచారం వేడెక్కింది. చివరి రోజు సోమవారం జోరుగా ప్రచారం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చిరుకానుకలు అందిస్తూ ఓట్లను వేయాలని అభ్యర్థించారు. తమనే గెలిపించాలని కోరారు. జనగామజిల్లాలో 13 మండలాలు, 301 గ్రామ పంచాయతీలు, 2746 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం మెదటి విడత ఐదు మండలాలు, రెండో విడత నాలుగు మండలాల్లో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించింది. ఈ నెల 30న బధవారం మూడో విడత మిగిలిన స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్, జఫరగఢ్, పాలకుర్తి మండలాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. 30న స్టేషన్ ఘన్‌పూన్, చిల్పూర్, జఫర్‌గడ్, పాలకుర్తి మండలాల్లోని జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐదు మండలాల్లో ని 92 పంచాయతీలు, 874 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 15 పంచాయితీలు, 204 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలోని శివునిపల్లి పంచాయతీకి నామినేషన్లు రానందున ఎన్నిక వాయిదా వేశారు. అదే విధంగా పలు కారణాలతో 19 వార్డులకు సైతం ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో 76 పంచాయితీలు, 651 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 76 సర్పంచ్ స్థానాలకు 242 మంది అభ్యర్థులు, 651 వార్డులకు 1604 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు అధికారులు పంచాయతీల వారీగా ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని నియమించారు. అదే విధంగా మంగళవారం ఉదయం నుంచి సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రమే సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అక్కడి ఎన్నికల అధికారికి రిపోర్ట్ చేస్తారు. తుది విడత ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.