తుపాను ముందు మౌనదీక్ష


తెలంగాణకు అడ్డొస్తే మహా ప్రళయం

సీమాంధ్ర నేతలకు టీజేఏసీ హెచ్చరిక

10 జిల్లాలలో మౌనదీక్ష విజయవంతం
జైపూర్‌ సదస్సులోనే తెలంగాణ ప్రకటించండి : కోదండరామ్‌
హైదరాబాద్‌, జనవరి 17(జనంసాక్షి) :
సీమాంధ్ర ప్రాంత నేతలు తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తే చరిత్రలో మిగిలిపోతారని.. అడ్డుపడితే మహా ప్రళయాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రక్రియ తుది దశకు చేరుకున్న సమయంలో అడ్డుకోవడం సరికాదని అన్నారు. తమది ఆత్మగౌరవ పోరాటమని, సీమాంధ్రులది ఆధిపత్య సమావేశమని మండిపడ్డారు. హైదరాబాద్‌ సహా పది జిల్లాతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద నిర్వహించిన మౌనదీక్షలో ఆయన మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు కె.కేశవరావు, నారాయణ, దత్తాత్రేయ, వినోద్‌, ఉద్యోగ సంఘాల నేతలు, న్యాయవాదులు, తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మౌన దీక్ష అనంతరం కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మినహా మాకు వేరే ప్రత్యామ్నయాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని కోరారు. చింతన్‌ బైఠక్‌లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ దీక్ష ఆత్మగౌరవానికి సంబంధించినదని, సీమాంధ్ర నేతలది ఆధిపత్య సమావేశమని మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకొనేందుకు సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌లో సమావేశాలు పెట్టి ప్రజలను రెచ్చగొట్టాలని చూడడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమవుతున్న తరుణంలో అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హింస తమ అభిమతం కాదని, శాంతియుతంగానే రాష్టాన్న్రి సాధించుకుంటామని చెప్పారు. తెలంగాణను ఆపడం ఎవరి తరం కాదని కేకే స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర నేతలకు మౌనం తప్పదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక ఉద్యమం ఏ ఒక్కరిదో కాదని యావత్‌ తెలంగాణ ప్రజలదని అన్నారు. తుది వరకు శాంతియుత పోరాటాలే సాగిస్తామని, అప్పటికీ అడ్డుతగిలితే మహా ప్రళయం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ఉద్యమం సాగుతున్నదని, తెలంగాణ ఏర్పాటు దిశగా ముందుకు సాగాలని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కోరారు. తెలంగాణపై వస్తున్న రకరకాల ప్రచారాలన్నీ ఊహాగానాలేనని అన్నారు. తెలంగాణపై ఏం చేయాలనేది సోనియా, కోర్‌ కమిటీకి తప్ప మరెవ్వరికీ తెలియదన్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ మనసులో ఏమి ఉందో ఇంతవరకు స్పష్టం కాలేదన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకొనేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణపై ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాథమిక హక్కును కాలరాస్తే తిరగబడే పరిస్తితి ఎదురవుతుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమన్న విశ్వాసంతోనే ముందుకెళ్లాలని కోరారు. పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రకటన చేయాలని బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఇంత మంది ఆత్మబలిదానాలు చేసుకున్న తర్వాతైనా కాంగ్రెస్‌ కళ్లు తెరవాలని, తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ కోరుకొనే వారంతా సహకరించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సూచించారు. ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్తున్న జేఏసీని ఆయన అభినందించారు. సంఘర్షణ మొదలైందని తెలంగాణ తథ్యమని ఆయన స్పష్టం చేశారు.