తూర్పులో ప్రవేశించిన జగన్ పాదయాత్ర
రాజమండ్రి వద్ద ఘనంగా స్వాగతం పలికిన నేతలు
భారీగా తరలివచ్చిన వైకాపా శ్రేణులు
రాజమహేంద్రవరం,జూన్12(జనం సాక్షి): ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జననేత వైఎస్ జగన్ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జికి చేరుకుని జిల్లాలోకి ప్రవేశించగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జననేత తమ జిల్లాలోకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది.పార్టీ నేతలు, కార్యకర్తలు, అశేష జనవాహిని తోడురాగా వైఎస్ జగన్ అడుగులు వేశారు. తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలిరావడంతో రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద పండగ వాతావరణం కనిపించింది. బ్రిడ్జి నుంచి పాదయాత్ర కొనసాగించిన వైఎస్ జగన్ శ్యామల థియేటర్ సెంటర్‌కు చేరుకున్నారు. మరోవైపు రోడ్ కం రైల్వే బ్రిడ్జిని వైఎస్సార్‌సీపీ జెండాలు, ప్లెక్సీలు, కటౌట్లతో సుందరంగా అలంకరించారు. బ్రిడ్జి కింద గోదావరిలో ఒక వైపున పార్టీ జెండాలతో అలంకరించిన 600 పడవలు స్వాగతం పలికాయి. బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్‌కు ఏడు అడుగుల ఎత్తు, 3.5 కిలోవిూటర్ల మేర భారీ పార్టీ జెండా కట్టి స్వాగతం పలికారు. జెండాలోని మూడు రంగుల చీరలతో 150 మంది మహిళలు 150 గుమ్మడికాయలతో హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రాజమహేంద్రవరం వద్ద బ్రిడ్జి ప్రారంభంలో కోటిపల్లి బస్టాండ్ ప్రాంతంలో మూడంచెల వేదిక ఏర్పాటు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేసిన పాదయాత్ర 2003 మే 17వ తేదీన రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్ బ్రిడ్జి నుంచి జిల్లాలోకి అడుగిడింది. ఆపై వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోడ్డు కం రైల్ బ్రిడ్జి విూదుగా 2013 జూన్ 4వ తేదీన రాజమహేంద్రవరం నగరం విూదుగా జిల్లాలోకి ప్రవేశించింది. తాజాగా ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న జననేత వైఎస్ జగన్‌కు మరోసారి తూర్పు గోదావరి జిల్లా వాసుల నుంచి అదే తీరుగా ఘనస్వాగతం లభించింది. ఆయన అడుగులో అడుగులు వేస్తూ వేలాదిగా మద్దతుదారులు, ప్రజలు మేముసైతం అంటూ పాదయాత్రలో భాగస్వాములయ్యారు.