తెదేపాకు, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా!

– రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిన వంశీ
– వైకాపా నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల వేధింపుల వల్లేనని వెల్లడి
– వంశీలేఖపై స్పందించిన అధినేత బాబు
– వైకాపా అక్రమ కేసులపై కలిసి పోరాడదామని పిలుపు
– పార్టీని వీడొద్దని సూచించిన చంద్రబాబు
– బుజ్జగింపుల బాధ్యతను నాని, నారాయణకు అప్పగింత
అమరావతి, అక్టోబర్‌28 జనం సాక్షి  :   కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాక రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా లేఖలో వంశీ పలు అంశాలను ప్రస్తావించారు. విూ నేతృత్వంలో ప్రజా ప్రతినిధిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ్యుడిగా విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, అయితే, నా అనుచరులు, మద్దతుదారులు.. స్థానిక వైకాపా నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వంశీ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చిందని, అయితే, వారి ఇబ్బందులను తొలగించేందుకు వేరే వాళ్లతో చేతులు కలిపే అవకాశం ఉన్నా నా మనస్సాక్షి అందుకు అంగీకరించడం లేదని తెలిపారు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చానని, పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుదామని నిర్ణయించుకున్నానని ఆ లేఖలో వంశీ పేర్కొన్నారు. అనవసర శత్రుత్వం వద్దనుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని, అందుకే పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు పంపిన లేఖలో వంశీ పేర్కొన్నారు. కాగా లేఖపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
వైకాపా వేధింపులపట్ల అందరి కలిసి పోరాడదామని, ఇందుకు పార్టీ వీడాల్సిన అవసరం లేదని చంద్రబాబు వంశీకి సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీలో నాయకులను కార్యకర్తలను కాపాడుకొనేందుకు అందరం కలిసి పోరాడదామని అన్నారు. కాగా చంద్రబాబు స్పందించటం పట్ల వంశీ సంతోషం వ్యక్తం చేస్తూ మరోలేఖను చంద్రబాబుకు పంపించారు. తన లేఖపై స్పందించినందకు చంద్రబాబుకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. 13ఏళ్లుగా విూ ఆదేశాలను పాటిస్తూ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు. ఎలాంటి దాపరికాలు లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని విూ(చంద్రబాబు) ముందుంచానని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా 2006 నుంచి విూరు చెప్పిన విధంగా, విూ మార్గదర్శకంలోనే నడిచానని, విూ ఆదేశానుసారం తొలిసారి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశానని అన్నారు. కానీ, ఓడిపోయానని, అలా ఐదేళ్ల విలువైన కాలం వృథా అయ్యిందని ఏనాడు బాధపడలేదని, ఓ సీనియర్‌ నేతపై, ఐపీఎస్‌ అధికారిపై, ఇలా ఎన్నోసార్లు నా పోరాటం సాగింది. అప్రాజాస్వామిక విధానాలపై నా పోరాటం ఎప్పుడూ ఆపలేదన్నారు. 2019ఎన్నికల్లో నన్ను ఆపేందుకు ప్రత్యర్థులు ఎలాంటి ఒత్తిడి తెచ్చారో విూకు తెలుసునని, విషయాన్ని ఇంకా పొడిగించి భిన్నాభిప్రాయాలకు తావివ్వడం నాకు ఇష్టం లేదని వంశీ లేఖలో పేర్కొన్నారు. నాకు అండగా ఉంటానన్నందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలిసో తెలియకో ఎక్కడైనా నా పరిధిదాటి ప్రవర్తిస్తే మన్నిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబుకు రాసిన రెండో లేఖలో వంశీ పేర్కొన్నారు. వల్లభనేని వంశీ రెండో లేఖపై కూడా చంద్రబాబు స్పందించారు. గతంలో విూరు చేసిన పోరాటాలను గుర్తుచేశారు. విూ పోరాటాలు పార్టీకి గుర్తున్నాయి. విూ పోరాటాలకు పార్టీతో పాటు నేను కూడా మద్దతిచ్చాను. విూకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు పార్టీ, నేను మద్దతుగా ఉంటామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో చర్చించండి. ప్రభుత్వ దుందుడుకు వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదామని చంద్రబాబు మరోసారి భరోసా ఇచ్చారు. అయితే బాబు ఆదేశాల మేరకు వంశీని బుజ్జగించేందుకు నాని, నారాయణ రంగంలోకి దిగారు.
పార్టీని వీడవద్దని వంశీని బుజ్జగించారు. మరోవైపు వంశీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి వంశీ తన నిర్ణయాన్ని విరమించుకుంటారా? రాజీనామాకే కట్టుబడి ఉంటారా అనేది ఇప్పుడు తెదేపా శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది.