తెదేపాను దెబ్బతీయడమే.. మోదీ వ్యూహం


– ప్రజాసమస్యలపై పోరాడేవారికి వారెంట్‌లు ఇచ్చారు
– ప్రజాదరణ ఉన్నవారిపై వేధింపులా?
– భాజపా పెడధోరణలు దేశానికే తీవ్ర ముప్పుగా పరిణమించాయి
– తెలుగువాళ్లు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్నదే తెదేపా ధ్యేయం
– సర్వే ముసుగులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయలేరు
– ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
అమరావతి, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : అవినీతిపరులతో అంటకాగుతూ దొంగలు అందరినీ దేశం దాటిస్తున్నారని భాజపాపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌, తప్పుడు సర్వేలను చేయించడంపైనా అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లకు వారెంట్లు ఇచ్చారని అన్నారు. ప్రజాదరణ ఉన్నవారిని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. భాజపా పెడధోరణులు దేశానికే తీవ్ర ముప్పుగా పరిణమించాయని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల వ్యూహాలు వికటిస్తున్నాయన్నారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ పరారీ వెనుక గుట్టుమట్లు భాజపా వెల్లడించాలన్నారు. ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పరారు కావడం వెనుక సూత్రధారులు.. పాత్రధారులు ఎవరో భాజపా వెల్లడించాలన్నారు. ఎనిమిదేళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడితే ఇప్పుడు వారెంట్లు రావడం ఏమిటని ప్రశ్నించారు. బాబ్లీ విూద పోరాటం ఎవరి కోసమని, 74మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు లాఠీదెబ్బలు తిన్నదెవరి కోసమని ప్రశ్నించారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్నదే తెదేపా ధ్యేయం అని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్టాల్రలో తెదేపాను దెబ్బతీయాలన్నదే నరేంద్ర మోదీ వ్యూహమని పేర్కొన్నారు. తెదేపా ఆధ్వర్యంలో మోదీ వ్యతిరేక శక్తులు బలోపేతం కావడంపై భాజపాలో అక్కసు నెలకొందని, భాజపా వ్యతిరేక కూటమిని బలహీన పరిచేందుకే మోదీ మహా కుట్రలు పన్నుతున్నారని యనమల ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు రావడం కూడా ఇందులో భాగమేమనని ఆయన దుయ్యబట్టారు. తమ చెప్పుచేతల్లో విూడియా సంస్థల ద్వారా బోగస్‌ సర్వేలు చేయించారని ఆరోపించారు. 2014లో ఇవే సంస్థలు చేసిన సర్వేలు అవాస్తవమని ప్రజాతీర్పు రుజువు చేసిందన్నారు. సర్వేల ముసుగులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం అసాధ్యమని, వేధింపు చర్యలకు ప్రజలే భాజపాకు గుణపాఠం చెబుతారని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నుంచి టీడీపీని దూరం చేయడం ఎవరి తరం కాదని మంత్రి యనమల స్పష్టం చేశారు.

తాజావార్తలు