తెరాస గెలుపుతోనే..  అన్ని వర్గాల అభివృద్ధి


– నాలుగేళ్లలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపాం
– సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. బాబు 30లేఖలు రాశాడు
– సత్తుపల్లికి గోదావరి జలాలు రావాలంటే టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
– కూటమి సీట్లు పంచుకునే లోపే మనం స్వీట్లు పంచుకుందాం
– ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌
ఖమ్మం, నవంబర్‌14(జ‌నంసాక్షి) : సీతారామ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని.. సత్తుపల్లిలో మహాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు ఓటు వేస్తే సీతారామా ప్రాజెక్టు ఆగిపోయినట్లేనని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుధవారం ఆయన తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సత్తుపల్లిలో పిడమర్తి రవి గెలుపుకై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మహాకూటమికి ఓటువేస్తే గోదావరి జలాలను సత్తుపల్లికి తీసుకురావాలన్న లక్ష్యం కలగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. పొరుగువారిని ప్రేమించాలని కొందరు పెద్దలు చెప్పారనీ, అందుకు తాము సిద్ధంగా ఉన్నా పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు మాత్రం సిద్ధంగా లేరని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మహాకూటమికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ సీట్లు ఇవ్వొచ్చనీ, చంద్రబాబు కట్టలుకట్టలు నోట్లు ఇవ్వొచ్చని.. అయితే ఓట్లు వేసేది మాత్రం తెలంగాణ ప్రజలేనని కేటీఆర్‌ అన్నారు. పిడమర్తి రవికి ఈసారి ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం తమ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కట్టించామన్నారు. మహాకూటమి నేతలు సీట్లు పంచుకునే లోపే మనం స్వీట్లు పంచుకుందామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో పిడమర్తి కృషి ఎంతో ఉందన్నారు. సీఎం కేసీఆర్‌తో పిడమర్తి రవి అనుబంధం దశాబ్దాలదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా అమలుకావడం లేదని తెలిపారు. రైతుబీమాతో అన్నదాతల్లో ధీమా కల్పించినట్లు వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లికి గోదావరి జలాలు తరలిస్తామన్నారు. కాగా సీతారామ ప్రాజెక్టు రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తుండని దుయ్యబట్టారు. ప్రాజెక్టును అడ్డుకొనేందుకు 30లేఖలు రాశానిడని కేటీఆర్‌ విమర్శించారు. సత్తుపల్లికి గోదావరి జలాలు కావాలంటే ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవాలని పేర్కొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌ కోసం గురుకుల పాఠశాలలు కట్టించామన్నారు. కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారు. సిద్దాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌, టీడీపీ
ఒక్కటయ్యాయని విమర్శించారు. తెలంగాణలో నాలుగేళ్లలో కేసీఆర్‌ అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని, దీంతో ప్రజల ఆదరణ పొందారని,  అన్నారు. దీనిని గమనించిన ప్రతిపక్ష పార్టీలు మరోసారి కేసీఆర్‌ గెలిస్తే.. మరింత అభివృద్ధి చేస్తాడని.. ఇక ప్రజలు మన పార్టీలను మరిచి పోతారని భావించి, కూటమిగా ఏర్పడి కుట్రలతో తెరాసను ఓడించేందుకు సిద్ధమయ్యాయని అన్నారు. ఈ కుట్రలను ప్రజలంతా గమనించి ఓటుతో తిప్పికొట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.