తెలంగాణను ఇంకెన్నాళ్లు సాగదీస్తారు?

యూపీఏ సమావేశంలో పవార్‌, అజిత్‌
బడ్జెట్‌ సమావేశాల తర్వాత నిర్ణయం : ప్రధాని
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని ఇంకెన్నాళ్లు సాగదీస్తారని యూపీఏ భాగస్వామ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు శరద్‌పవార్‌, అజిత్‌సింగ్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ప్రశ్నించారు. మంగళవారం జరిగిన యూపీఏ సమావేశంలో వారు తెలంగాణ అంశాన్ని లేవనెత్తారు. అక్కడి ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం వివిధ రూపాల్లో ఉద్యమం సాగిస్తున్నారని, మిగతా ఏ డిమాండ్‌ కోసం ఇంత పోరాటం సాగింది లేదని గుర్తు చేశారు. సుమారు వెయ్యి మంది తెలంగాణ ఆకాంక్షను తెలపడానికే ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో టీ కాంగ్రెస్‌ ఎంపీలు చేస్తున్న నిరసన కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. ఎంపీలు స్థానికంగా తిరగలేని పరిస్థితి ఉందంటే ఉద్యమ తీవ్రత ఎంతలా ఉందో గుర్తించాలని, ఇంకా  జాప్యం చేస్తే ఎలాంటి పరిణామాలు అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వీరి వాదనలు సావదానంగా విన్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తర్వాత నిర్ణయమేంటో వెల్లడిస్తామన్నారు.