తెలంగాణను ఇక తేల్చండి

తెలంగాణపై తేల్చేందుకు ఇదే మంచి సమయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తేల్చకుండా నాన్చుతూ ఇంత కాలం నెట్టుకు వచ్చిన కేంద్రప్రభుత్వానికి ఇప్పుడు తేల్చడం మినహా మరో గత్యంతరం లేదు. తెలంగాణపై సానుకూల నిర్ణయం ప్రకటించేందుకు ఇదే మంచి తరుణం.

ఉప ఎన్నికల  సందర్భంగా అధికార పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తోసహా పలువురు సీనియర్‌ నాయకులు సీమాంధ్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని, కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందంటూ జోరుగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ సీమాంధ్ర ప్రజలు జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే అఖండ మెజార్టీతో గెలిపించారు. కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా సీమాంధ్ర ప్రజలు రాష్ట్ర విభజనకు తామూ అనుకూలమే సంకేతాలు ఇచ్చినట్టయింది. లగడపాటి అండ్‌ కో ఎన్నికల ప్రచారంలో చెప్పింది, భయపెట్టించినదాంట్లోనూ  నిజం ఉంది. సీమాంధ్రలో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపుతో రాష్ట్రవిభజన ఖాయమవడమే కాంగ్రెస్‌ నేతల కంగారుకు కారణంగా చెప్పుకోవచ్చు.

వైఎస్సార్‌  కాంగ్రెస్‌ పార్టీని గెలిపించడం ద్వారా రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు  ఆమోదం తెలుపగా, పరకాల ఓటర్లు టీఆర్‌ఎస్‌ను గెలిపించడం ద్వారా తెలంగాణ వాదాన్ని, ప్రత్యేక రాష్ట్ర కాంక్షలు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలను చూసైనా కేంద్రం తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఆ పండుగ, ఈ పండుగ, ఆ ఎన్నికలు, ఈ ఎన్నికలు అంటూ ఇంత కాలం తెలంగాణ అంశాన్ని నాన్చుతూ, దాటవేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు తప్పించుకునేందుకు అన్ని మార్గాలు లేవు. సాకులు చూపితే చావుదెబ్బ తప్పదు. తెలంగాణ అంశంపై ఇంకా కేంద్రప్రభుత్వానికిగాని, కాంగ్రెస్‌ పార్టీ నాయకులకుగాని తెలంగాణ ప్రజలు ఇవ్వరనే విషయం ఇప్పటికైనా గ్రహించి తెలంగాణను తేల్చాలి.