తెలంగాణపై కుట్రలు సాగవు

కాళేశ్వరం చూసి నిజాలు తెలుసుకోండి
జనగామ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక తమ ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు విమర్శలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య మండిపడ్డారు. తెలంగాణను మరోసారి విచ్ఛిన్నం చేసేందుకు దృష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సాధించుకున్న తెలంగాణనను మరోసారి విచ్చిన్నం చేయాలని చూసేవారికి గుణపాఠం తప్పదన్నారు.రాజకీయ పార్టీల కుట్రలను టీఆర్‌ఎస్‌లోని ప్రతీ కార్యకర్త సైనికుల్లా మారి ఎక్కడిక్కడ తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఉద్యమ నాయకుడు రాష్టాన్రికి సారథిగా ఉండటంతో సీమాంధ్ర పాలనలో ఏ రంగంలో ఏ జిల్లాకు అన్యాయం జరిగిందో తెలిసిన వ్యక్తిగా సంక్షేమం, అభివృద్ధితోపాటు సాగు, తాగునీరు, పారిశ్రావిూకరణ, పట్టణీకరణ వంటి అంశాల్లో రాష్టాన్న్రి సమతూకంగా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారని చెప్పారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో జనగామ సహా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో గోదారమ్మను తెలంగాణ పొలాలకు తరలించేందుకు చేపట్టిన కాళేళ్వరం ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తిచేసి రైతన్నల గుండెల్లో నిలిచారని అన్నారు.దేశం అబ్బురపడేలా ముఖ్యమంత్రి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన నిర్మించేందుకు కృషి చేశారన్నారు. ఈ ప్రాజెక్టు భారతదేశంలోని అన్ని రాష్టాల్రకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో రైతాంగ అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. రైతన్నలు బాగుండాలనే ఆలోచనతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కాంగ్రెస్‌ నేతలకు హితవు పలికారు.