తెలంగాణపై కేంద్రం దొంగాట

 

– అఖిలపక్షం పేరుతో సాగదీతకే నిర్ణయం

– ఇద్దరు చొప్పున ప్రతినిధులను పంపాలని తొమ్మిది పార్టీలకు లేఖలు

– కేంద్రం చిత్తశుద్ధిపై అనుమానాలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :

యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై దొంగాటను వీడటం లేదు. 2009 నుంచి ఇప్పటి వరకు సంప్రదింపులు, చర్చలు, అభిప్రాయాల సేకరణ పేరుతో కాలం గడిపిన ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలోనూ అదే వైఖరి కొనసాగించనుంది. ఈమేరకు కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి స్కందన్‌ పేరుతో రాష్ట్రంలోని తొమ్మిది పార్టీలకు బుధవారం లేఖలు పంపారు. పార్టీకి ఇద్దరు చొప్పున ప్రతినిధులు హాజరుకావాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, ఎంఐఎం, సీపీఐ, బీజేపీ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలకు కేంద్రం తరఫున లేఖలు అందాయి. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంబిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంత నేతలు కేంద్రం నిర్ణయాన్ని విభేదిస్తూ వరుసగా రాజీనామాలు చేయడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. హైదరాబాద్‌ ఎక్కడ తమకు దక్కకుండా పోతుందోనని సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ప్రజలను రెచ్చగొట్టి పోటీ ఉద్యమానికి తెరతీశారు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల ఉద్యమానికి, సీమాంధ్ర ప్రజల 11 రోజుల వీధి పోరాటాన్ని కేంద్రం ఒకే ఘాటన కట్టి కేంద్రం అదే నెల 23న మళి ప్రకటన చేసింది. దీంతో తెలంగాణ భగ్గుమంది. ఉద్యమం మళ్లీ ఉర్రూతలూగింది. కేంద్రం సమస్య పరిష్కారానికంటూ వేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోగా మరింత జఠిలం చేసింది. కమిటీ సిఫార్సులను తెలిపేందుకు రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఎనిమిది పార్టీలను ఆహ్వానించి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనూ పార్టీకి ఇద్దరు చొప్పున ప్రతినిధులు వెళ్లి ఎవరి పాట వారే పాడుకుని వచ్చారు. టీఆర్‌ఎస్‌, సీపీఐ మినహా మిగతా పార్టీల ప్రతినిధులు భిన్నాభిప్రాయాలు తెలిపారు. దీంతో అఖిలపక్షం ఎలాంటి ఫలితాన్నివ్వని వృథా ప్రయాసగా మిగిలిపోయింది. అప్పటి నుంచి కేంద్రం పలు సందర్భాల్లో సంప్రదింపుల ద్వారా సమస్యకు పరిష్కారమిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు సమస్యను దాటవేస్తూ 2014 ఎన్నికల వరకు లాగాలని కేంద్రం యత్నిస్తోంది. టీ కాంగ్రెస్‌ ఎంపీల ఒత్తిడి మేరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర హోం శాఖ ఈ మీటింగ్‌తో సంప్రదింపుల ప్రక్రియ ముగియని తేల్చి చెప్పారు. మూడు రోజుల క్రితం హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మీడియాతో మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినందున సమస్య గురించి తెలుసుకునేందుకు ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు నిస్సిగ్గుగా ప్రకటించారు. ఎంపీలు పార్టీ అధిష్టానంపై చేసిన ఒత్తిడితో కేంద్రం కొంత తగ్గినట్లుగా కనిపించినా విధాన పరమైన లేఖ వెలువడ్డాక దాని అసలు రంగు బయటపడింది.