‘తెలంగాణ’పై తక్షణమే తేల్చాలి
ఎమ్మెల్సీ యాదవరెడ్డి
హైదరాబాద్, జూలై 10 : తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే తేల్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని తేల్చకుంటే కాంగ్రెస్ పార్టీకి గడ్డురోజులేనని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని పరిష్కరించకుండా మంత్రుల కమిటీలతో ప్రయోజనం ఏమిటని ఆయన అన్నారు. తెలంగాణలో అన్ని సమస్యల్లోకెల్లా ప్రత్యేక రాష్ట్ర సమస్యే ప్రధానంగా ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని త్వరలో తేల్చే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా మంత్రుల కమిటీలతో ప్రయోజనంలేదని ఆయన అన్నారు. గతంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు లేవనెత్తిన సమస్యలే పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. ఆ సమస్యలు పరిష్కరించకుండా, ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడితే వచ్చే లాభం ఏమీ ఉండదని యాదవరెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంతో పార్టీకి ఒనగూరేదిఏమీలేదని ఆయన అన్నారు.రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని, ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని చేపడితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని యాదవరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మంత్రులు కూర్చుని చర్చించుకుంటే ఏంలాభమని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే కార్యకర్తలతో చర్చలు జరపాలని ఆయన అన్నారు. అప్పుడే పార్టీ పటిష్టమవుతోందని, ప్రజా సమస్యలపై కార్యకర్తలు కూడా విస్తృతంగా చర్చలు చేపడతారని ఆయన అన్నారు. మంత్రుల కమిటీలో సీనియర్ మంత్రులను నియమిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నా తెలంగాణ ఇవ్వలేదన్న ఆగ్రహం కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని త్వరగా తేలిస్తే కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని యాదవరెడ్డి అన్నారు.