తెలంగాణలో కుటుంబపాలన
– దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,అక్టోబర్13(జనంసాక్షి):
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని… దీనిపై అన్ని పార్టీలు పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలను కేసీఆర్ నెరవేర్చట్లేదన్నారు. కేసీఆర్ తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు తప్ప… రైతులు, ప్రజల గురించి పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని పేర్కొన్నారు. సభలో రైతు సమస్యలపై చర్చించాలని అడిగిన శాసనసభ్యులను సస్పెండ్ చేయడం దురదృష్టకర సంఘటనగా దిగ్విజయ్ అభివర్ణించారు. ఈనెల 19న పాతబస్తీలో రాజీవ్ శాంతిర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో రాజకీయ విభేదాలున్నా… ఆయన చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… జగన్ తన ప్రాణాలను ఫణంగా పెట్టొద్దన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. ఏపీ నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడుతామన్నారు. అలాగే ఖజానాలో డబ్బులు లేకుండా రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ప్యాకేజీలు ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. అలాగే అమలుకాని హావిూలు ఇవ్వడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిపుణుడు అని అన్నారు. ఇక… తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. తన కుటుంబం కోసమే కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని దిగ్విజయ్ పేర్కొన్నారు.