తెలంగాణలో డెంగ్యూ లేదు

– సెలువులు తీసుకోకుండా వైద్యులు సేవలందిస్తున్నారు

– ఎక్కడా మందుల కొరతలేదు

– ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి

– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

– జగిత్యాలలో మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు

కరీంనగర్‌, సెప్టెంబర్‌13(జనంసాక్షి):  రాష్టంలో ఎక్కడా డెంగ్యూ జ్వరాలు లేవని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కేవలం మలేరియా, టైఫాయిడ్‌ మాత్రమే ఉన్నాయని చెప్పారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో రోటా వైరస్‌ వ్యాక్సిన్లను శుక్రవారం ఈటల రాజేందర్‌ ప్రారంభించి పిల్లలకు వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు… రాష్ట్రంలో వైరల్‌ జ్వరాలు ఉన్నాయని, కానీ డెంగ్యూ జ్వరాలు లేవని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు భూతద్ధంతో చూస్తున్నాయని విమర్శించారు. వైద్యులు సెలవులు కూడా రద్దు చేసుకుని రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మందుల కొరత లేదన్నారు. రాష్ట వ్యాప్తంగా డయాలసిస్‌ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. వారికి కూడా పెన్షన్‌ అందే విధంగా కృషి చేస్తానన్నారు. సమైక్య రాష్ట్రంలో ఒక్క మెడికల్‌ కాలేజీ రాలేదని.. తెలంగాణ వచ్చాక నాలుగు మెడికల్‌ కళాశాలలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గోదావరిఖని లేదా మంచిర్యాలలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. గోదావరిఖనిలోనే మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ ఈటల ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మంచిర్యాలలో ఏర్పాటు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. దీంతో తప్పకుండా గోదావరిఖనిలోనే మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి హవిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల, జడ్పీ చైర్మన్‌ పుట్టా మధు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌, జిల్లా కలెక్టర్‌ శ్రీ దేవసేన పాల్గొన్నారు.

మంత్రుల కాన్వాయ్‌ని గైరావ్‌ చేసిన స్థానికులు..

హన్మంత్‌పూర్‌లో 30రోజుల ప్రణాళిక కార్యక్రమానికి వెళ్తున్న మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి కాన్వాయ్‌ను జగిత్యాలలోని కోడిమ్యాలలో రైతులు అడ్డగించి తమ సమస్యలు పరిష్కరించాలని నిలదీశారు. తమకు సాగునీటిని అందించాలంటూ రామ్‌నగర్‌ రైతులు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకుని ఘోరావ్‌ చేశారు. అంతేకాదు, కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు ఇచ్చిన హావిూలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంటనే పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆరు కుటుంబాలకు రావలసిన పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలని రోడ్డుపై బైటాయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని ఆందోళన చేపట్టారు. 15నిమిషాల పాటు మంత్రుల వాహనాలను ఎటూ కదలనీయకుండా అడ్డగించారు. ఆందోళన కారులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.