తెలంగాణలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తాం

4

– కాంట్రాక్టు లెక్చరర్లకు త్వరలో తీపీ కబురు

– కడియం

హైదరాబాద్‌ 16 జులై  (జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను పటిష్టం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఇంటర్‌ ఉచితవిద్య సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఉచిత ఇంటర్‌ విద్య అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్థిక అసమానతలతో పాటు, విద్యాఅసమానతలు భవిష్యత్తులో తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఉచిత విద్యతో పాటు 1.40లక్షల మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల కేజీ టూ పీజీ అమలు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే కాంట్రాక్టు లెక్చరర్లు శుభవార్త వింటారని ఉప ముఖ్యమంత్రి కడియం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్‌ పీఎస్సీ మెంబర్‌ విఠల్‌, ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ,ఇంటర్‌ బోర్డు జేఏసీ నేత మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధూంధాం కార్యక్రమం గ్రాండ్‌ గా జరిగింది.రాష్ట్రంలో ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ స్కూల్స్‌, కాలేజీలు, యూనివర్సిటీలను పటిష్ఠం చేయాలని నిర్ణయించామన్నారు. అటు ఇప్పటికే కేజీ టూ పీజీ విద్యపై మేధావులతో చర్చలు జరిపి అభిప్రాయాలు సేకరిస్తున్నమని తెలిపారు. అటు కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజ్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసారు.

ఇక ఉచితంగా ఇంటర్‌ విద్యను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతదని టీఎస్‌ పీఎస్పీ మెంబర్‌ విఠల్‌ అన్నారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను కడియం శ్రీహరి పరిష్కరిస్తున్నరని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్యనందించడం అభినందనీయమన్నారు ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ.ఇంటర్‌ ఉచిత విద్యపై రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నదన్నారు జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌. బంగారు తెలంగాణకు ఇది ఒక అడుగు అని చెప్పారు. కార్పొరేట్‌ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తమని ఇంటర్‌ జేఏసీ నేత మధుసూధన్‌ రెడ్డి తెలిపారు. కనుమరుగవుతున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు ప్రాణం పోసిన సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలన్నారు. అంతకుముందు విద్యార్ధులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేసారు. పాఠ్యపుస్తకాలు అందించడం కోసం ..మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌ చేస్తున్న సేవలు ఆయన అభినందించారు