తెలంగాణలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ ఆరంభం

2
– ఫీజుల పెంపును నిరసించిన విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌,జులై29(జనంసాక్షి):

విద్యార్థి సంఘాల తీవ్ర ఆందోళ మధ్య తెలంగాణ తొలి ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ బుధవారం ప్రారంభమైంది. కన్వీనర్‌ కోటా ఫీజుల పెంపును నిరసిస్తూ వివిధ విద్యార్తి సంఘాలు ఆందోళనకు దిగడంతో కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా 1575 ఎంబీబీఎస్‌, 640 బీడీఎస్‌ సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్‌ కోసం రాష్ట్రంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌లోనే రెండు కేంద్రాలున్నాయి. జేఎన్‌టీయూ, ఉస్మానియా దూరవిద్యా కేంద్రం, వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ, విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉదయం 9 గంటలకే కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2015-16 వైద్య విద్య సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ నిర్వహణకు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 85 శాతం సీట్లను స్థానికులతో, 15 శాతం సీట్లను అన్‌రిజర్వడ్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. తొలిరోజు 1వ ర్యాంకు నుంచి 1000వ ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ పూర్తవుతుంది. ఆగస్టు 3తో కౌన్సెలింగ్‌ పక్రియ ముగుస్తుంది. ఆగస్టు 5 నుంచి 9 తేదీ వరకు రిజర్వేషన్‌ కేటగిరిలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అయితే కన్వీనర్‌ కోటా ఫీజులను భారీగా పెంచడంపై విద్యార్థిసంఘాలు మండిపడ్డాయి.

విద్యార్థి సంఘాల ఆందోళన

తెలంగాణ వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా ఫీజుల పెంపును నిరసిస్తూ ఓయూ, జేఎన్‌టీయూలోని కౌన్సెలింగ్‌ కేంద్రాల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కన్వీనర్‌ కోటా ఫీజును వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో కౌన్సెలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిలింగ్‌ నిర్వహించకుండా ఆందోళనకు దిగారు.  వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద ఫీజుల పెంపును నిరసిస్తూ ఓయూలో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ అడ్డుకునేందుకు కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో  జెన్టీయూ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్‌ఎఫ్‌ఐఎ, ఏబీవీపీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కౌన్సెలింగ్‌ పక్రియను అడ్డుకొనేందుకు యత్నం చేశాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి సంఘం నేతలను అడ్డుకున్నారు. తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ  సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మెడికల్‌ విద్యకు దూరమయ్యే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. పేదలకు ఉన్నత విద్యనందిస్తామన్న ప్రభుత్వం వారిని ఉన్నత విద్యకు తెచ్చే విధానాలు అవలంబించడం లేదని పేర్కొన్నారు. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఫీజులు పెంచుతూ గతంకంటే 10 శాతం బి కేటగిరీ సీట్లనూ యాజమాన్య కోటా కింద మారుస్తూ ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. ఎ కేటగిరీ సీట్లకు రూ.60 వేలు అలాగే ఉంచి సి1 కేటగిరీకి రూ.9 లక్షలు, సి2 కేటగిరీకి రూ.11 లక్షల చొప్పున ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. బి కేటగిరీ సీట్ల ఫీజులను రూ.2.40 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పేదొకమాట, చేసేదొకతీరుగా కనబడుతోందని తెలిపారు.