తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్,ఆగష్టు 9(జనంసాక్షి):రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. మెదక్ జిల్లా దుబ్బాక, మిర్ దొడ్డి, దౌల్తాబాద్, రామాయంపేట, శంకరంపేట, గజ్వేల్, కొండపాక, వర్గల్, జగదేవ్ పూర్ మండలాల్లో వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వర్షం పడుతోంది. కరీంనగర్ పట్టణం, తిమ్మాపూర్ లోనూ ఒక మోస్తరు వర్షం కురిసింది. రాయ్ కల్, జగిత్యాల, సారంగపూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. నల్లగొండలో ఒక మోస్తరుగా, నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి సహా పలుచోట్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ లో, జిల్లాలోని మంచిర్యాల డివిజన్ లో పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. వరంగల్ జిల్లా జనగామలో మోస్తరు వర్షం కురవగా, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో భారీ వర్షం పడింది. జిల్లాలోని పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి.
మరోవైపు, ఒడిశా నుంచి కోస్తాంధ్ర విూదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై 3.6 నుంచి 7.6 కిలోవిూటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. అది రెండు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు బలహీనంగా ఉన్నప్పటికీ తెలంగాణలో ఈ నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆవర్తనం అల్పపీడనంగా మారితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.