తెలంగాణవాదులు నల్లజెండాల ప్రదర్శన
సంగారెడ్డి, నవంబర్ 1 : రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా గురువారంనాడు తెలంగాణవాదులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా గల తహశీల్దార్ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలుగు కార్యాలయం పైన నల్లజెండాలు ఎగురవేసి నిరసనలు తెలిపారు. తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట పట్టణాల్లో విద్యార్థినీ విద్యార్థులు నల్లజెండాల ప్రదర్శన జరిపారు. మెదక్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దేవేందర్‌రెడ్డి, రాందాస్ చౌరస్తాలో నల్లజెండాను ఆవిష్కరించి విద్యార్థులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పోరాటాలు నిర్వహిస్తామని ప్రమాణాలు చేయించారు. పట్టణ పురవీధుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి జెండాలు చేతబూని పెద్ద ఎత్తున ప్రదర్శన జరిపారు. దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం ప్రభుత్వ పరంగా నిర్వహించకుండా రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. ఈ సందర్భంగా పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం గమనించదగిన విషయమని అన్నారు.