తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ : 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ మండలం కోంటూరు పెద్ద చెరువులో సబ్సిడీపై 1,84,500 చేప పిల్లల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో చెరువులన్నీ నిండటంతో చేప పిల్లలు వదిలి నీలి విప్లవం తీసుకురావాలన్నారు.ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లలను పెంచి మత్స్యకారులు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలని ఆకాంక్షించారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్‌ ఎం. లావణ్య రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, మెదక్ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, మెదక్ పీఏసీఎస్‌ చైర్మన్ హన్మంత్ రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు కిష్టయ్య, మెదక్ ఎమ్మార్వో శ్రీనివాస్, నాయకులు రవి సిద్ధ గౌడ్, మోహన్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.